Gujarat student : కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బొర్సాద్ ప్రాంతానికి చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. అలాగే, తన ఖర్చుల కోసం అక్కడ పని చేస్తోంది కూడా. త్వరలో కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది.
ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఆమె కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. విధి మేఘ కోసం వెతుకుతుండగా కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. దీంతో విధి మేఘ మృతిపై పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని కెనడా పోలీసులు తెలిపారు.
ఇటీవలి కాలంలో కెనడాలో భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. భారతీయులు హత్యకు కూడా గురవుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో శివాంక్ అవస్థి అనే 20 ఏళ్ల భారతీయ వైద్య విద్యార్థిని టొరంటోలో కాల్చి చంపారు. 2025 ఏప్రిల్‌లో హర్సిమ్రత్ రంధావా అనే 21 ఏళ్ల భారతీయ విద్యార్థి కూడా హత్యకు గురయ్యారు. రెండు గ్రూపులు కాల్పులు జరుపుకోగా, ఈ ఘటనలో హర్సిమ్రత్ ప్రాణాలు కోల్పోయారు. 2024 డిసెంబర్లో కూడా హర్ష్‌దీప్ సింగ్ అంటాల్ కూడా హత్యకు గురయ్యాడు. ఇలా పలువురు భారతీయులు హత్యకు గురవుతుండటంతో కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.