డమాస్కస్: సిరియా రాజధాని డమాస్కస్ శివారులో ఉన్న ఓ చర్చిలో ఆత్మాహుతి (Suicide Bombing) దాడి జరిగింది. డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. కిక్కిరిసిన చర్చిలో జనం ప్రార్థనలు చేస్తుండగా ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నాడు. దీంతో ఇప్పటివరకు 22 మంది చనిపోయారు. మరో 63 మంది గాయపడ్డారు. చనిపోయినవారులో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రసంస్థ బాద్యులమని ప్రకటించుకోలేదు.
చర్చిలో జనం మధ్యకు చేరుకున్న ఓ వ్యక్తి తొలుత తుపాకీతో కాల్పులు జరిపి, అనంతరం తనను తాను పేల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు సిరియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దుండగుడు చర్చిలో గ్రెనేడ్ విసిరినట్లు చర్చి బిషప్ తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని తాను చూశానని, అతనితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. దీనిని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. కాగా, చర్చిల్లో దాడులు జరగడం సిరియాలో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.