Robbery | న్యూఢిల్లీ: సినిమాల్లో చూపించే దోపిడీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. దుండగులు కేవలం 3 నిమిషాల్లో దుకాణాన్ని దోచేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పుణె కేంద్రంగా ఉన్న బాధిత పీఎన్ జ్యువెల్లర్స్ తన వెబ్సైట్లో పేర్కొన్న కథనం ప్రకారం.. సుమారు 20 మంది ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు.
షాపునకు కాపలాగా ఉన్న ఒక్క గార్డును భయపెట్టి, అద్దాల ద్వారం పగులకొట్టి వారు షాపులోకి ప్రవేశించారు. వెంటనే షోరూం అంతా వ్యాపించి డెస్కుల అద్దాలను సుత్తులతో పగులగొట్టి అందినకాడికి నగలను సంచుల్లో గబగబా వేసుకొని పరారయ్యారు. వారికి ఆ ప్రాంతం గురించి బాగా తెలిసినట్టు అనిపిస్తున్నదని స్థానిక మీడియా పేర్కొంది. అయిదుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.