న్యూయార్క్: అమెరికాలోని గురుద్వారాలో (Gurudwara) కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని శాక్రమెంటో కౌంటీలో (Sacramento County) ఉన్న గురుద్వారా ఇద్దరు వ్యక్తులు పరస్పరం కాల్పులు (Shootout) జరుపుకున్నారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. గాయపడినవారిలో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించామని తెలిపారు. ఈ ఘటన ఆదివారం రాత్రి 2.30 గంటలకు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇవి విద్వేషపూరితంగా (Hate crime) జరిగిన కాల్పులు కావని పోలీసులు స్పష్టం చేశారు.
Gurudwara
గురుద్వారాలో నగర్ కీర్తన్ వేడుకలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఇద్దరు తెలిసిన వ్యక్తుల మధ్య చిన్న గొడవ జరిగిందని శాక్రమెంటో కౌంటీ పోలీసు అధికారి అమర్ గాంధీ (Amar Gandhi) చెప్పారు. గొడవ పెద్దదిగా మారడంతో ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారని, ఆ తర్వాత ఒకరిపైఒకరు కాల్పులకు పాల్పడ్డారని వెల్లడించారు. ప్రస్తుతం గురుద్వారా ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు. కాగా, గతేడాది అమెరికాలో 44 వేల తుపాకీ కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నారు.