కైరో: ఈజిప్టులో (Egypt) రాజధాని కైరోలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర కైరోలో (Cairo) ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derails) తప్పింది. దీంతో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు నైలు డెల్టాలోని (Nile Delta) మెనోఫ్ నగరానికి వెళ్తుండగా కల్యూబ్ నగరంలోని స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్పారు. ఈ రైలు ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలికి కనీసం 20 అంబులెన్స్‌లను పంపించామని, క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించామన్నారు. ఈజిప్టులో రైలు ప్రమాదాలు సాధరణంగా జరుగుతున్నాయి. 2021లో దక్షిణ ఈజిప్ట్ నగరమైన తహతాలో రెండు రైళ్లు ఢీకొనడటంతో 32 మంది మరణించారు. గతేడాది జరిగిన ఓ రైలులో మంటలు చెలరేగి 300 మందికిపైగా ప్రయాణికులు మృతిచెందారు.
ఈ నెల 1న గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళ్తున్న ఓ ప్రయాణికుల రైలు, తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును బలంగా ఢీకొట్టింది. దీంతో 57 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 85 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైళ్లో 300 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో 200 మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు.