కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర ఈజిప్టులోని నైల్ డెల్టాలో ఓ మినీ బస్సు బోల్తాపడి 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈజిప్టు ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. మినీ బస్సు స్టీరింగ్ పట్టేయడంతో డ్రైవర్ దాన్ని మలుపు తిప్పలేకపోయాడని, దాంతో మూలమలుపు వద్ద ఎదురుగా ఉన్న గోతిలో బస్సు పడిపోయిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. అధ్వాన్నమైన రహదారులు, డ్రైవింగ్ రూల్స్ అతిక్రమణ లాంటి కారణాలతో అక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది అక్కడ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. గత జూలైలో కూడా సెంట్రల్ ఈజిప్టులో బస్సు, లారీ ఢీకొని 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 35 మంది గాయపడ్డారు.