హామ్‌బర్గ్: జర్మనీలోని హామ్‌బర్గ్‌లో (Hamburg) దారుణం చోటు చేసుకుంది. సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాంపై నిల్చున్న వారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడిచేశాడు (Knife Attack). దీంతో 18 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొంత మందికి స్వల్పంగా గాయాలు అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.
దాడికి గల కారణం ఏమిటన్నది ఇప్పటివరకు తెలియరాలేదు. రైల్వే స్టేషన్లోకి అకస్మాత్తుగా చొరబడిన వ్యక్తి పలువురిని గాయపరిచినట్లు మీడియా వెల్లడించింది. తొలుత ఎనిమిది మందికి గాయాలైనట్లు పేర్కొన్నాయి. ఆ తర్వాత బాధితుల సంఖ్య 18కి చేరినట్లు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కరే ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తున్నది.