పారిస్: ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. దీంతో అక్కడ వందల సంఖ్యలో విమానాలను రద్దు చేశారు(Flights Cancelled). వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ర్యాన్ఎయిర్ సంస్థ 170 విమానాలను రద్దు చేసింది. దీంతో 30 వేల మంది ప్రయాణికుల హాలీడే ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన రెండు సంఘాలు రెండు రోజల ధర్నా చేస్తున్నాయి. ఆ దేశంలోని నాలుగో వంతు విమానాలు గ్రౌండ్ అయ్యాయి.
పారిస్, నీస్ విమానాశ్రయాల్లో ఎక్కడిక్కడే విమానాలు నిలిచిపోయాయి. యూనియన్ డిమాండ్లు ఆమోదయోగ్యంగా లేవని ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి ఫిలిప్ టబరాట్ తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ ఉద్యోగుల సమ్మెపై ర్యాన్ఎయిర్ సంస్థ ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌కు వచ్చిపోయే విమానాలే కాదు.. బ్రిటన్, ఐర్లాండ్, స్పెయిన్, గ్రీస్‌కు వెళ్లే విమానాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నది.