ప్రాగ్: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో కాల్పులు (Mass Shooting) కలకలం సృష్టించాయి. జన్ పలాచ్ స్క్వేర్లోని చార్లెస్ యూనివర్సిటీలో (Charles University) చొరబడిన సాయుధుడు బీభత్సం సృష్టించాడు. ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపడంతో 15 మంది మరణించారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
యునివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు భవనంలో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహించారు. కాల్పులు జరిపిన వ్యక్తి అదే వర్సిటీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. కాగా, కాల్పుల ఘటనకు ఏ తీవ్రవాద సంస్థకు సంబంధం లేదని చెక్ రిపబ్లిక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రాకుసన్ తెలిపారు. పోలీసుల విచాణరకు సహకరించాలని స్థానికులకు విజ్ఞప్తిచేశారు.