అబుజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం అర్ధరాత్రి జిగావా రాష్ట్రం మజియా పట్టణం వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనలో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి సీరియస్‌గా ఉందని అత్యవసర విభాగం బుధవారం వెల్లడించింది.
అనేక మృతదేహాలు గుర్తించలేని విధంగా దెబ్బతిన్నాయని తెలిపింది. మృతుల సంఖ్య 140కు చేరుకుందని, సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించినట్టు నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ హెడ్ నురా అబ్దుల్లా చెప్పారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో ట్యాంకర్ బోల్తా పడిందని పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు.
ట్యాంకర్ బోల్తా పడ్డ సంగతి తెలిసి, పెద్ద సంఖ్యలో సామాన్య జనం అక్కడికి పరిగెత్తుకు వచ్చారని, ట్యాంకర్ నుంచి కారే ఇంధనాన్ని డబ్బాల్లో పట్టుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. వారు పెట్రోల్‌ను తీసుకుంటున్న సమయంలో మంటలు చెలరేగి, ట్యాంకర్ పేలిపోయిందని తెలిపారు.