కీవ్: కీవ్‌ను మళ్లీ టార్గెట్ చేసింది రష్యా(Russian Strikes). తాజా దాడిలో 13 మంది మృతిచెందారు. 40 మంది గాయపడ్డారు. మరో వైపు ఉక్రెయిన్ వద్ద ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల సంఖ్య తగ్గిపోయింది. కీవ్ నగరంలోని అపార్ట్మెంట్ బ్లాకులు, వేర్‌హౌజ్‌లను ధ్వంసం చేశారు. కొన్ని ప్రదేశాల్లోని చిల్డ్రన్ హాస్పిటల్, స్కూళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు షార్టేజ్ కావడం వల్ల మృతుల సంఖ్య పెరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ కావాలని ఉక్రెయిన్ గత కొన్ని నెలల నుంచి పశ్చిమ దేశాలను కోరుతున్న విషయం తెలిసిందే.
కీవ్ సమీపంలో ఉన్న అయిదు మిలిటరీ పరిశ్రమలను టార్గెట్ చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. డ్రోన్ తయారీ ప్లాంట్లను టార్గెట్ చేశారు. మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి జరిగింది. ఫైర్ పాయింట్ అనే వెపన్ కంపెనీపై అటాక్ చేశారు. సుదీర్ఘ, మధ్యశ్రేణి డ్రోన్లను అక్కడ తయారీ చేస్తున్నారు. ఫ్లమింగో క్రూయిజ్ మిస్సైళ్ల అసెంబ్లింగ్, బూస్టర్ స్టోరేజీ అక్కడ జరుగుతున్నట్లు గుర్తించారు. ఫైర్ పాయింట్ కంపెనీకి చెందిన ఉత్పత్తులను జెలెన్స్కీ అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తున్నారు.
ఆంటొనోవ్ ఏవియేషన్ ప్లాంట్‌కు చెందిన మరో కేంద్రాన్ని కూడా టార్గెట్ చేశారు. ఏఎన్-196 లుటి లాంగ్ రేంజ్ డ్రోన్లు, యూఏవీలను అక్కడ డిజైన్, ఉత్పత్తి చేస్తున్నారు. బాబా యాగా డ్రోన్ గిడ్డంగిపై కూడా అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. మార్తుసోవ్కా లాజిస్టిక్ సెంటర్‌ను కూడా రష్యా టార్గెట్ చేసింది. యూఏవీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ అక్కడ స్టోరేజ్ చేస్తారు. బ్రోవెరీలో ఉన్న 8వేల క్యూబిక్ మీటర్ల ఫ్యూయల్ డిపోను పేల్చేశారు.