బీజింగ్ : టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 126 మంది ప్రాణాలు కోల్పోగా, 188 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప ప్రభావం నేపాల్, భారత్‌లలో కూడా కన్పించింది. టిబెట్‌లోని డింగ్రీ కౌంటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉందని, దీని ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయని చైనా వార్తా సంస్థ సీసీ టీవీ వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారత్‌లోని బీహార్ రాజధాని పాట్నా, ఇతర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కన్పించింది. అస్సాం, పశ్చిమ బంగాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి.
టిబెట్ సరిహద్దుని ఆనుకుని ఉన్న తమ 7 జిల్లాల్లో భూకంపం వచ్చినట్టు నేపాల్ అధికారులు తెలిపారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోని లబుచె ప్రాంతంలో ఉదయం 6.30 గంటలకు ఈ భూకంపం సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్లో 10 కి.మీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం ఆరుసార్లు భూకంపం వచ్చినట్టు చెప్పారు.
హిమాలయ ప్రాంతంలో సంభవించిన భూకంపంపై టిబెట్ ఆధ్యాత్మిక వేత్త దలైలామా సంతాపం వ్యక్తం చేశారు. మారుమూల హిమాలయ ప్రాంతాల్లో సంభవించిన ఈ విధ్వంసంలో మరణించిన వారి కుటుంబాల కోసం ప్రార్థనలు చేయనున్నట్టు చెప్పారు. భూకంపం తర్వాత తమవైపు ఉన్న ఎవరెస్ట్ పర్యాటక ప్రాంతాలను చైనా తాత్కాలికంగా మూసివేసింది. బాధిత ప్రాంతాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని చైనా అధ్యక్షుడు జిన్సింగ్ అధికారులను అదేశిండంతో సహాయ సామగ్రితో విపత్తు రక్షక బృందాలు టిబెట్‌కు బయలుదేరాయి.