China | స్టాక్హోమ్: చైనాలోని పశువుల కొట్టాల్లో పెద్ద సంఖ్యలో వైరస్లు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉన్ని కోసం పెంచే జంతువుల్లో వైరస్ల జాడను కనుగొన్నారు. స్వీడెన్కు చెందిన పరిశోధకులు 2021 నుంచి 2024 మధ్య చైనాలో మరణించిన 461 జంతువుల నుంచి నమూనాలు సేకరించి, జన్యుపరమైన అధ్యయనం చేశారు. వీటిల్లో 412 జంతువులు పశువుల కొట్టాల్లో ఉన్ని ఉత్పత్తి కోసం పెంచేవి.
ఈ జంతువుల్లో 125 రకాల వైరస్లను పరిశోధకులు గుర్తించారు. వీటిల్లో 36 వైరస్లు కొత్త రకమైనవి. మరో 39 వైరస్లు ఇతర జంతువులు, మనుషులకు సోకగలిగే ముప్పు ఉన్నవి. వీటిల్లోనూ 13 వైరస్లు ప్రమాదకరమైనవని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.