Gold Treasure | వాషింగ్టన్, మార్చి 9: మధ్య అమెరికా దేశమైన పనామాలో పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 1200 ఏండ్ల నాటి ఒక ఆసక్తికర సమాధిని గుర్తించారు. పనామా నగరానికి 100 మైళ్ల దూరంలోని ఎల్ కానో ఆర్కియాలజికల్ పార్కులో కనుగొన్న ఈ సమాధిలో పలువురి శవాల అవశేషాలతో పాటు భారీ యెత్తున బంగారు సంపదను గుర్తించారు.
విలువైన బంగారు దుస్తులతో పాటు బెల్ట్లు, నగలు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, బ్రాస్లెట్లు, గంటలు, సిరామిక్ వస్తువులు వంటివి ఇందులో ఉన్నాయి. కోక్లే సంస్కృతికి చెందిన ఒక ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిలో వీటిని గుర్తించారు. అప్పటి పోకడల ప్రకారం.. చనిపోయిన ఉన్నతస్థాయి వ్యక్తితో పాటు వారికి తోడుగా ఉండేందుకు బలిదానం చేసిన దాదాపు 32 మంది శవాల అవశేషాలను కూడా ఆ సమాధిలోనే గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్త జులియో మాయో తెలిపారు.