కీవ్, డిసెంబర్ 29: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. గురువారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, ఒడెస, ల్వీవ్, జైటోమిర్ నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. క్షిపణి దాడుల మోతతో కీవ్ నగరం దద్దరిల్లింది. ఇక్కడ రెండు భారీ బాంబు పేలుళ్లు సంభవించగా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పలు స్టేడియాలు, పరిశ్రమలు దాడుల్లో దెబ్బతిన్నట్టు కీవ్ అధికారులు వెల్లడించారు. వేర్వేరు దిశల నుంచి నగరాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించింది. గగనతలం, సముద్రం నుంచి క్షిపణులు, ఆత్మహుతి డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొన్నది.
దేశమంతా అంధకారం
క్షిపణి దాడుల సంకేతాన్ని తెలియజేస్తూ ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగడంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు షెల్టర్లలో తలదాచుకున్నారు. క్షిపణి దాడుల నష్టాన్ని తగ్గించడానికి కీవ్, ల్వీవ్, ఒడెస, రిహ్ తదితర ప్రాంతాల్లో ముందుగానే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. రష్యా మిస్సైల్ దాడుల కారణంగా కీవ్‌లో దాదాపు 40 శాతం మంది ప్రజలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
54 క్షిపణులు కూల్చేశాం: ఉక్రెయిన్
రష్యా చేసిన దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దాడులను తిప్పికొట్టడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించామని, రష్యా తమ దేశంపై 69 మిస్సైళ్లను ప్రయోగించగా, వాటిలో తాము 54 మిస్సైళ్లను కూల్చేశామని ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. కాగా, రష్యా 120 క్షిపణులను ప్రయోగించిందని అంతకుముందు ఉక్రెయిన్ తెలిపింది.