న్యూఢిల్లీ: వెనిజువెలా చుట్టూ గగనతలాన్ని మూసివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దేశ భూభాగాన్ని అమెరికా దురాక్రమించుకునే అవకాశం ఏక్షణంలోనైనా ఉందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. వెనిజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోతో తాను మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించినప్పటికీ అమెరికాకు చెందిన అతి పెద్ద యుద్ధ నౌక గెరాల్డ్ ఆర్.ఫోర్డ్తోసహా 10 అమెరికా యుద్ధనౌకలు కరీబియన్ సముద్రానికి అత్యంత సమీపంలో తిష్టవేసినట్లు వార్తలు వస్తున్నాయి. భూఆక్రమణ చేసే సామర్థ్యం ఉన్న సముద్రపు సాహసయాత్ర యూనిట్ కూడా కరీబియన్ చేరువలోనే ఉన్నట్లు న్యూయార్క్ పోస్టు తెలిపింది. యూఎస్ఎస్ గెరాల్డ్డ్పైన దాదాపు 70 యుద్ధ విమానాలను నిలిపే సామర్థ్యం ఉంది. ఉత్తర కరోలినాలోని వైమానిక కేంద్రం నుంచి పనిచేసే 2,200 మంది నావికులను కూడా కరీబియన్కి అమెరికా తరలించింది.
దాదాపు 15,000 మంది సైనిక సిబ్బంది కూడా అక్కడే మోహరించినట్లు వార్తలు వచ్చాయి. సోషలిస్టు దేశమైన వెనిజువెలా నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా చర్యలు తీసుకుంటోంది. దేశాన్ని వదిలి వెళ్లిపోయే అవకాశాన్ని వెనిజువెలా అధ్యక్షుడు మదురోకు అమెరికా ఇచ్చినట్లు రిపబ్లికన్ సెనేటర్ మార్క్వేయే ములిన్ వెల్లడించారు. రష్యా లేక మరే ఇతర దేశానికైనా వెళ్లిపోవాలని ఆయనకు అవకాశం ఇచ్చినట్లు సెనేట్ ఆర్డ్ సర్వీసెస్ కమిటీ సభ్యుడైన ముల్లిన్ చెప్పారు. మదురో తన పదవికి రాజీనామా చేయడం లేదా ఆయనపై సైన్యం లేదా అధికారులు తిరుగుబాటు చేసే పరిస్థితులు కల్పించేలా ఒత్తిడి తీసుకురావడమే ట్రంప్ ఉద్దేశమని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.