న్యూయార్క్: అమెరికాలోని న్యూ ఓర్లాన్స్ జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ(Inmates Escaped) అయ్యారు. జైలులో విధులు నిర్వహిస్తున్న వారి హెల్ప్తోనే ఇలా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పరారీ అయిన ఖైదీల్లో .. హంతకులు ఉన్నారు. ఓర్లాన్స్ పారిస్ జస్టిస్ సెంటర్లో .. విచారణ ఎదుర్కొంటున్న, జైలుశిక్ష పడాల్సిన ఖైదీలు ఉంటారు. అయితే ఆ ఖైదీల వయసు 19 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఖైదీలు పరారీ అయినట్లు తెలుస్తోంది.
ఓ సెల్లో ఉన్న టాయిలెట్ వెనుక భారీ రంధ్రం చేసి ఖైదీలు పరారీ అయ్యారు. గోడ ఎక్కి బయటకు దూకిన ఆ వ్యక్తలు సమీప రహదారి మీదకు వెళ్లినట్లు తెలుస్తోంది. పది మందిలో ఇద్దర్ని పట్టుకున్నారు. మరో 8 మంది ప్రస్తుతం ఇంకా చిక్కలేదని జైలు వర్గాలు చెబుతున్నాయి. ఖైదీల పరారీకి చెందిన నిఘా టీవీ దృశ్యాలు కూడా రిలీజ్ అయ్యాయి.
పరారీ కోసం పోలీసు శాఖ వ్యక్తులే సహకరించినట్లు జైలు అధికారి హట్సన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. మానవ వేటను పోలీసులు కొనసాగిస్తున్నారు.