Plane Crash | విదేశీ ప్రయాణికులతో వెళుతున్న ఓ బుల్లి విమానం ఆదివారం దక్షిణ బ్రెజిల్ టూరిస్ట్ సిటీ గ్రామాడోలోని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో పది మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. వారంతా మరణించి ఉంటారని పౌర, రక్షణ శాఖల అధికారులు చెప్పారు. ‘దురదృష్టవశాత్తు విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరూ జీవించి ఉండే అవకాశం లేదు’ అని గవర్నర్ ఎడౌర్డో లెల్టే ఎక్స్ కాతాలో పోస్ట్ చేశారు. గాయపడిన వారిలో 15 మందిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామని ప్రజా భద్రతాధికారి కార్యాలయం తెలిపింది.
వారిలో అత్యధికులు విమానం షాపులపైకి దూసుకు రావడంతో మంటలు తలెత్తిన తర్వాత వచ్చిన పొగ వల్ల శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. విమానం తొలుత ఒక ఇంటిపై గల చిమ్నీని తాకడంతోపాటు రెండో ఫ్లోర్ లోకి దూసుకెళ్లింది. అటుపై ఒక ఫర్నీచర్ స్టోర్లో కుప్పకూలిందని అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతంలోని గ్రామాడో అత్యంత పాపులర్ పర్యాటక కేంద్రం. అసాధారణ వరదలతో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇక క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అందరూ పండుగ కోసం ముస్తాబవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం స్థానికుల్లో విషాదాన్ని నింపింది.