న్యూఢిల్లీ: అమెరికాలో సుమారు లక్షన్నర మంది సిక్కు డ్రైవర్లు(Sikh Truck Drivers) ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఆ దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. అక్కడి రవాణా శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ శాఖ కూడా ట్రక్కు డ్రైవర్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తోంది. అమెరికాలో స్థిరపడేందుకు వెళ్తున్న పంజాబీ యువకుల్లో ఎక్కువ శాతం మంది ట్రక్కు డ్రైవర్లుగా మారుతున్నారు. అమెరికాలోని వెస్ట్ కోస్ట్ ప్రాంతంలోనే సుమారు ట్రక్కు డ్రైవర్లుగా 40 శాతం మంది పంజాబీలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దేశవ్యాప్తంగా సిక్కు డ్రైవర్లు సుమారు 20 శాతం ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే డ్రైవర్లను ప్రభుత్వం కఠినంగా స్కాన్ చేస్తున్న నేపథ్యంలో సిక్కు డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 3 వేల డ్రైవింగ్ స్కూళ్లకు సర్టిఫికేషన్ రవాణా శాఖ రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ట్రైనింగ్ వసతులు లేని కారణంగా రానున్న 30 రోజుల్లో ఈ నిర్ణయం తీసుకునే ఛాన్సు ఉంది. 4500 స్కూళ్లకు వార్నింగ్ ఇచ్చారు. కాలిఫోర్నియాలోని వలస కార్మికుల ఆధీనంలో ఉన్న డ్రైవింగ్ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. కమర్షియల్ లైసెన్సు కోసం ట్రక్కు డ్రైవర్లకు అర్హత, సామర్థ్యం ఉందో లేదో తెలుసుకునేందుకు రవాణశాఖ తనిఖీలు మొదలుపెట్టింది. ఒకవేళ ప్రమాణాలకు తగినట్లు డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ ఇవ్వకుంటే, అప్పుడు చాలా మంది సిక్కు డ్రైవర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. శిక్షణకు తగ్గ ప్రమాణాలు లేని సుమారు మూడు వేల స్కూళ్ల లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది.
ఇటీవల ఫ్లోరిడా, కాలిఫోర్నియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో.. డ్రైవర్లు సిక్కులే. దీంతో పంజాబీలపై అమెరికా ట్రాన్స్పోర్టు శాఖ వారిపై నిఘా పెట్టింది.