నేషనల్ డెస్క్: భూలోకం కింద అధోలోకం ఉంటుందని.. అందులో అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే, మిగతా లోకాల గురించి పక్కనబెడితే భూ కేంద్రకం స్థానంలో మాత్రం పాతాళ లోకం ఆనవాళ్లు లభించినట్టు తాజాగా పరిశోధకులు చెబుతున్నారు. కథలుగా, పుక్కిటి పురాణాలుగా మారిన ఆ రహస్య ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.
భూ ఉపరితలం నుంచి 6,400 కిలోమీటర్ల కింద గోళాకారంలో ఓ కోర్ (భూ కేంద్రక భాగం) ఉంటుందని, ఐరన్ ఓర్‌తో నిండిన ఆ కోర్ కఠిన ఘన స్థితిని కలిగి ఉన్నదని ఇప్పటివరకూ పుస్తకాల్లో చదువుకున్నాం. గత 50 ఏండ్లుగా పరిశోధకులు కూడా ఇదే నమ్ముతున్నారు. అయితే, కోర్ ప్రాంతం ఘన స్థితిలో కాకుండా మెత్తగా ఉన్నదని, అందులో బోలుగా కొన్ని ఖాళీ ప్రదేశాలు కూడా ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
కొత్త ప్రపంచం
భూ పొరలను క్రస్ట్, మాంటల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్గా విభజిస్తారు. లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు, పీడనంలో మార్పులు చోటుచేసుకుంటాయి. సుమారు 1300 కిలోమీటర్ల వ్యాసార్ధంతో ఉండే భూ కేంద్రకం (కోర్) కఠినమైన ఘన స్థితిలో ఉంటుందని ఇప్పటివరకూ అందరూ భావించారు. అయితే, మెత్తటి పదార్థంతో కేంద్రకం నిండి ఉన్నదని, ఔటర్ కోర్ చుట్టూ ద్రవ పదార్థం ఉన్నదని భూకంప శాస్త్రవేత్త జెసీకా ఇర్వింగ్ తెలిపారు. కోర్ మధ్య ప్రాంతంలో కొన్ని ఖాళీలు ఉన్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. అయితే ఆయా ప్రదేశాల్లో బ్రహ్మాండమైన ఉష్ణోగ్రతలు, పీడనం ఉంటుందని తెలిపారు. ఆ ఖాళీ ప్రాంతాలనే ‘పాతాళలోకం’గా భావిస్తున్నారు. ‘మిస్టరీ వరల్డ్’ వాదనను కొట్టిపారేయలేమంటున్నారు.
ఎలా కనుగొన్నారు?
కోర్ ఉన్న ప్రాంతానికి శాస్త్రవేత్తలు కొన్ని శక్తివంతమైన కాంతి తరంగాలను పంపించారు. కఠినమైన ఘన పదార్థం ఉన్న కోర్ ప్రాంతానికి వెళ్లిన తరంగాలు తిరిగి వెనక్కి వచ్చాయి. అయితే, కోర్‌లోని మరికొన్ని ప్రాంతాల గుండా ప్రసరించిన తరంగాలు తిరిగి వెనక్కి రాలేదు. ప్రయోగ విధానంలో ఏమైనా తప్పులు దొర్లాయేమోనని ఒకటికి రెండు సార్లు ప్రయోగాలను మళ్లీ, మళ్లీ చేశారు. అయినప్పటికీ, ఫలితాల్లో మార్పు రాలేదు. దీంతో ఆయా ప్రాంతాలు మెత్తగా, ఖాళీగా ఉన్నాయన్న అభిప్రాయానికి పరిశోధకులు వచ్చారు.
నవలలో చెప్పింది.. నిజం కానుందా?
జూల్స్ వెర్నో అనే ఫ్రెంచ్ నవలా రచయిత 1864లో ‘జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్’ అనే నవలను రాశారు. భూ కేంద్రకంలో మరో ప్రపంచం ఉన్నదని, భారీ జీవులు అక్కడ సంచరిస్తున్నట్టు ఆ కాల్పనిక గాథలో వర్ణించారు. ఈ నవల రాసేంతవరకు అసలు భూకేంద్రకం ఎలా ఉంటుందన్న దానిపై కూడా శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. అయితే, నవలలో పేర్కొన్నట్టు భూమిలోపల పాతాళలోకం ఉండొచ్చన్న వాదనకు తాజా పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి. కాగా ఈ నవల ఆధారంగా పలు హాలీవుడ్ చిత్రాలు కూడా నిర్మితమయ్యాయి.