పెరిగిన పెట్రోల్ ధరలకు.. వచ్చే పైసలకు పొంతన లేదు
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో డెలివరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆందోళన
చిక్కడపల్లి/ముషీరాబాద్, ఏప్రిల్ 5: జొమాటో డెలివరీ బాయ్స్‌కు పెరిగిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా డెలివరీ చార్జీలు పెంచాలని మంగళవారం హైదరాబాద్ డెలివరీ బాయ్స్, గర్ల్స్ అసోసియేషన్ (సీఐటీ) ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్ హాజరై మాట్లాడారు. ఫుడ్ డెలివరీ యాపుల్లో పనిచేసిన డెలివరీ బాయ్స్, గర్ల్స్‌కు శ్రమకు దగ్గ ఫలితం రావటం లేదన్నారు. ఎండనకా, వాననకా పనిచేస్తుంటే యాజమాన్యాలు డెలివరీ బాయ్స్ శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు.
నగరంలో పని చేస్తున్న జొమాటో బాయ్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జొమాటో యాజమాన్యం పెరిగిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా డెలివరీ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జె.కుమార స్వామి, టి.మహేందర్, జొమాటో బాయ్స్ అసోసియేషన్ సభ్యులు హనుమారెడ్డి, రవీందర్, నాయుడు, హరిబాబు, దిలీప్, ఆంజనేయులు, సాయి, పిట్టర్, సాయి, చరణ్, సునీల్, రాజేవ్, రాజ్ పాల్గొన్నారు.
పికప్ అమౌంట్ ఇవ్వడం లేదు…
గతంలో రెస్టారెంట్‌కు వెళ్లేటప్పుడు పికప్ అమౌంట్ ఇచ్చేది. ఇప్పుడు దాన్ని ఇవ్వమంటున్నారు. రెస్టారెంట్ దగ్గర డ్యూటీ చార్జీలు ఇవ్వడం లేదు. పెట్రోల్ రేట్లు పెరిగినట్లుగానే మాకు ఇచ్చే వేతనం (కమీషన్) పెంచాలని కోరుతున్నాం. నగరంలో పని చేస్తున్న వేలాది మంది సమస్యలను అధికారులు పట్టించుకోవాలి.
– హనుమారెడ్డి, జొమాటో డెలివరీ బాయ్