సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో జీరో ఎఫ్ఐఆర్లు భారీగా నమోదయ్యాయి. బీఎన్ఎస్ఎస్ 2023 చట్టంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్లు ఎక్కువ నమోదు చేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ఆయా పోలీస్స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా వేగంగా కేసులు నమోదు చేయాలని బీఎన్ఎస్ఎస్ చట్టం చెబుతుంది. ఈ నేపధ్యంలో ఈ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. రాచకొండ కమిషనరేట్‌లో 2025లో 264 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
అయినా చాలా కేసుల్లో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. అత్యవసరమైన కేసుల్లో కాకుండా ఇతరాత్ర కేసుల్లో మాత్రం తమ పరిధి కాదంటూ తిప్పి పంపిస్తున్నారు. చాలా వరకు కీలకమైన కేసుల విషయంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. మరికొందరు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కంటే, బాధితులను పక్కనే ఉండే పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తే తమ పని పూర్తవుతుందని భావించే వాళ్లు కూడా ఉంటున్నారు. ఇలా జీరో ఎఫ్ఐఆర్ల నమోదులో బీఎన్ఎస్ఎస్ వచ్చిన తరువాత పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
బాధితులకు త్వరగా న్యాయం జరగడం, సంఘటన స్థలంలో ఆధారాలు చెడిపోకుండా ఉండేందుకు దగ్గరలో ఉండే పోలీసులకు ఫిర్యాదు అందింతే వెంటనే కేసులు నమోదు చేయడం, తరువాత విచారణ కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు ఆయా కేసులను పంపిస్తున్నారు. బాధితులు ముందుగా ఫిర్యాదు ఇచ్చిన ఠాణాలో సంబంధిత ఫిర్యాదుపై జీరో నెంబర్‌తో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దానిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేస్తారు. బదిలీ అయినా పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. రాచకొండలోని మల్కాజిగిరిలో అత్యధికంగా జీరో ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, మహేశ్వరం జోన్లో అత్యల్పంగా ఈ కేసులు నమోదయ్యాయి. రాచకొండ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలు ఆయా జోన్లలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ల గణాంకాలను వెల్లడించారు.
జీరో ఎఫ్ఐఆర్లు
జోన్ పేరు : జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్య
మల్కాజిగిరి : 91
ఎల్బీనగర్ : 87
మహేశ్వరం : 25
యాదాద్రి భువనగిరి : 61