జూబ్లీహిల్స్, అక్టోబర్ 14: యూసుఫ్‌గూడ డివిజన్ సమస్యల వలయంలో చిక్కుకుపోయింది. ఇక్కడ ప్రధానంగా ఉన్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తి అయ్యే సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. దీంతో ఈ సమస్య నేటికీ అపరిష్కృతంగానే ఉంది. బాక్స్ డ్రైన్ పనులు పూర్తయితే యూసుఫ్‌గూడ ప్రధాన వ్యాపార కూడలిగా ఉన్న కృష్ణానగర్, ఎల్ఎన్ నగర్లలో వరద ముంపు సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.
సివరేజి, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైన్ లైన్లు.. గణనీయంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా విస్తరించకపోవడంతో ఈ సమస్య తీవ్రమయ్యింది. దీనికితోడు వెంకటగిరి నుంచి కృష్ణానగర్, ఎల్ఎన్ నగర్ వరకు నాలాలపై ఆక్రమణలు పెద్ద ఎత్తున పెరిగి పూడికతీత కష్టసాధ్యంగా మారిపోయింది. ఫలితంగా చిన్నపాటి వర్షానికే కృష్ణానగర్ మునిగిపోతుంది. లక్ష్మీనర్సింహనగర్‌లో కూడా వరద ముంపు సమస్య తీవ్రవుతోంది. నాలాలపై ఆక్రమణలు పెరగడంతో పూడికతీసేవారు లేక వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ట్రాఫిక్ పద్మవ్యూహంలో..
యూసుఫ్‌గూడలో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన చర్యలు అంతంత మాత్రమే. దీంతో ఐటీ ఉద్యోగులకు వారధిగానే కాక నగరంలోని అన్ని ప్రాంతాలను కలిపే కూడలిగా ఉన్న యూసుఫ్‌గూడ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బస్తీ కూడలిలో ట్రాఫిక్ జంక్షన్ ఏర్పాటుకు పలుమార్లు సర్వే చేపట్టి నిధులు కేటాయించినా ప్రభుత్వం మారడంతో ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటుతో ఈ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రధానంగా శ్రీనగర్ కాలనీ రోడ్డు, యూసుఫ్‌గూడ బస్తీ, మహమూద్ ఫంక్షన్ హాల్, మెట్రో స్టేషన్‌రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి.పెరిగిన రద్దీకి అనుగుణంగా అభివృద్ధి పనులు జరుగకపోవడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
నడుములోతు నీళ్లు నిలుస్తున్నాయి
కృష్ణానగర్‌లో వరద సమస్య తీవ్రంగా ఉంది. వరద నీరు దుకాణాలను ముంచెత్తడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే షాప్‌లు మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వరదనీరు నడుములోతుకు వస్తుండటంతోఅందరిపనులు నిలిచిపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.
– రాజశేఖర్, బైక్ మెకానిక్, కృష్ణానగర్
విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది
యూసుఫ్‌గూడలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఒకవైపు రోడ్లపై మురుగునీటి సమస్యకు తోడు విద్యుత్ నిలిచిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ముఖ్యంగా ఎగ్జామ్స్ సమయంలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేస్తుండటంతో చదువుకోటానికి ఇబ్బందిగా ఉంది.
– సాయి, విద్యార్థి, కృష్ణానగర్