సైదాబాద్, జనవరి 21:స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం… నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని తుంగపాడ్ గ్రామానికి చెందిన టైల్స్ వర్కర్ పుల్కారం నరేశ్ తన స్నేహితుడు మణికంఠతో కలిసి సోమవారం సైదాబాద్‌కు వచ్చాడు. మరో స్నేహితుడు మహేశ్‌తో కలిసి ముగ్గురు పిసల్‌బండలోని కరీం అనే మిత్రుడి పెండ్లికి హాజరయ్యారు.
ముగ్గురు కలిసి అక్కడి నుంచి సైదాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని జ్యూస్ సెంటర్ దగ్గర ఉండే అయేషా అనే స్నేహితురాలిని కలిసేందుకు వచ్చారు. ఆమెను కలిసిన తర్వాత నరేశ్ తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా.. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన గుర్తు తెలియని నలుగురు యువకులు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తూ దుర్బాషలాడుతూ.. వారిపై దాడికి పాల్పడటంతో మణికంఠ, రాజేశ్ అక్కడి నుంచి తమ వాహనంపై వెళ్లిపోయారు.
ఒంటరిగా మిగిలిన నరేశ్ష్ను గుర్తు తెలియని యువకులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టడమే కాకుండా అతడి వద్ద ఉన్న రూ.1,500, పర్సు, సెల్‌ఫోన్ గుంజుకున్నారు. మణికంఠకు ఫోన్‌చేసి తమకు మరిన్ని డబ్బులు ఇస్తేనే నీ స్నేహితుడు నరేశ్ష్ను వదిలి పెడుతామని బెదిరించగా, తన వద్ద డబ్బులు లేవనడంతో అతడిని వదిలిపెట్టారు. భయభ్రాంతులకు గురైన నరేశ్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.