ఘట్కేసర్, ఫిబ్రవరి 1: ఘట్కేసర్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణంపై నిరీక్షణకు వెంటనే తెర దింపాలని, ఓట్ల కోసం నాటకాలు చేస్తే పతనం తప్పదని ఘట్కేసర్ పట్టణ యువత హెచ్చరించారు. ఘట్కేసర్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఘట్కేసర్ పట్టణ యువత నల్ల చొక్కాలతో రోడ్డెక్కి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ‘అసమర్థ ప్రభుత్వం నశించాలి, బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం చేసిన నాయకులారా సిగ్గు సిగ్గు, గ్రామాన్ని అభివృద్ధి చేయని నాయకులు మాకు వద్దు, యువత మేలుకో బ్రిడ్జి నిర్మాణం చేసుకో’ అనే నినాదాలతో ప్లే కార్డులు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు.
ఘట్కేసర్ బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఘట్కేసర్ రైల్వే గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు నిరీక్షిస్తున్నా ప్రజలకు మొండి చెయ్యి చూపిన ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరువాలని డిమాండ్ చేశారు. 17 ఏళ్లుగా వంతెన నిర్మాణం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు, స్థానిక నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే ఈ దుస్థితికి కారణమని ఆరోపించారు. నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జిని అడ్డుపెట్టుకుని ఓట్ల రాజకీయాలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఇప్పటి వరకు నాయకులు హామీలు, అధికారుల మాటలు నమ్మి మోసపోయామని, ఇచ్చిన హామీలకు అతీగతీ లేదని ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి నెల రోజులలో పూర్తి చేయాలని, లేనిచో వంతెన పూర్తయ్యే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడి బ్రిడ్జి కంట్రాక్టర్ సత్తిరెడ్డి జాతీయ రోడ్డుపై నిర్మించే పనులను వేగవంతం చేస్తున్నాడని, ఘట్కేసర్ బ్రిడ్జి విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రశ్నించారు. ఈ అంశంపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా యువత అంతా ఏకమై వచ్చే ఆధివారం కంట్రాక్టర్ చేపడుతున్న నిర్మాణ ప్రాంతాలను దిగ్బంధిస్తామని హెచరించారు. యువత నల్ల చొక్కాలు ధరించి ఒక్కసారిగా రోడ్డుపై వచ్చి నినాదాలు చేయడంతో పట్టణంలో ఒక్కసారిగా వాతావరణ వేడెక్కింది. బ్రిడ్జి సమస్యతో ఇబ్బందలు పడుతున్న పట్టణ ప్రజలు, మహిళలు, విద్యార్థులు సైతం వారితో చేతులు కలిపారు. దీంతో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఘట్కేసర్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుల ర్యాలీ ఘట్కేసర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.