ఆదిభట్ల : ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై బొంగులూరు టోల్ ప్లాజా ఎగ్జిట్ నంబర్ 13 వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కూరగాయల లోడ్‌తో వెళ్తున్న మహీంద్రా బొలెరో వాహనం ముందు వెళ్తున్న టస్కర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మండలం దేవరబండ గ్రామానికి చెందిన కొటకొండ శివ (22), తన మామ నాగేశ్వర్రావుతో కలిసి (ఏపీ39-డబ్ల్యుజీ-6841) నంబర్ గల బొలెరో వాహనంలో కూరగాయల లోడ్‌తో డోన్ నుంచి వరంగల్ జిల్లా పరకాల వైపు వెళ్తున్నాడు.
బొంగులూరు వైపు ORR ఎగ్జిట్ నంబర్ 13 వద్దకు చేరుకోగానే (TS12UC-2823) నంబర్ గల ఇనుప రాడ్ల లోడ్‌తో వెళ్తున్న టస్కర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ శివ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ఉన్న నాగేశ్వర్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.