ఖైరతాబాద్, జూలై 28 : ఖైరతాబాద్‌లో లంపెన్ గ్యాంగ్ చాపకింద నీరులా రాజ్యమేలుతోంది.. పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఠాణా సాక్షిగా ఈ గ్యాంగ్ దాడులు, దౌర్జన్యా లు, సెటిల్మెంట్లు, అర్ధరాత్రుళ్లు గంజాయి దందా చేస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ యువకుడిపై దాడి చేసి కొట్టగా అ వమానభారంతో ఆతను ఆత్మహత్య చేసుకోవడంతో వారి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకా రం.. ఖైరతాబాద్‌లోని న్యూ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన వీరబోయిన ముఖేశ్బాబు (30) పాలవ్యాపారం నిర్వహిస్తున్నాడు. స్థానికంగా అమ్మవారి దేవాలయం వద్ద ఓ బ్యానర్ తొలగింపు విషయంలో కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృ తుడి సోదరుడు రాకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కట్టలు తెంచుకున్న స్థానికుల ఆగ్రహం
కాగా, ముఖేశ్ బాబు ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు మాత్రం ఆ గ్యాంగేనని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మృతుడి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న స్థానికులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్, విచారణ కోసం వచ్చిన పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, ఎమ్మెల్యే వెనుదిరిగారు. సైఫాబాద్, ఖైరతాబాద్ పీఎస్‌ల పర్యవేక్షణ బాధ్యత చేపడుతున్న ఓ పోలీస్ ఉన్నతాధికారి అండదండలతో దాడు లు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నా రంటూ స్థానికులు బహిరంగంగానే ఆరోపించారు. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
నిందితులకు సేఫ్ జోన్‌గా!
ఈ ఏడాది మార్చిలో డబుల్ బెడ్రూం వద్ద ఓ యువకుడిపై దాడి చేయడంతో పోలీసులను ఆశ్రయించగా, సెటిల్ చేసుకోవాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ పంచాయితీ కోర్టుకు చేరగా, కాంప్రమైజ్ అయినట్లు తెలిసింది. తాజాగా ఐమాక్స్ థియేటర్ ఎదురుగా ఇద్దరు దంపతులపై దాడిచేసి కొట్టగా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల కుటుంబ సభ్యులపై కూడా దాడిచేసినట్లు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న హెచ్ఎండీఏకు చెందిన ఈ ఖాళీ స్థలంలోనే గంజాయి, మత్తు పదార్థాలను సదరు గ్యాంగ్ సరఫరా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తు న్నారని, ఖైరతాబాద్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధి వారికి సేఫ్ జోన్‌గా మారిందని పలువురు వాపోతున్నారు.