అంచెలంచెలుగా మత్తులో మునుగుతున్న యువత
వినియోగదారుల నుంచి విక్రేతలుగా అవతారం
రూ.50వేల పెట్టుబడితో .. లక్షల ఆదాయం
ఏ రంగం వారు ఆ రంగం వారితో నెట్వర్క్ విస్తరణ
పబ్ కల్చర్ ఎలా ఉంటుంది? తొలినాళ్లలో మెదడులో తలెత్తిన ఉత్సాహం.. ఆ యువకుడిని స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లేలా చేసింది. ఒక సాయంత్రం బీర్‌తో ఛీర్… అన్నాడు. కొన్ని వారాలు ఆ సరదా ముగిశాక.. మరింత కిక్ కావాలనుకున్నాడు.. చివరకు మత్తుకు బానిసయ్యాడు. ఇలా బీరుతో మొదలై ..గంజాయితో ఒక మెట్టు ఎక్కి.. ఆపై హశీశ్ ఆయిల్..హెరాయిన్.. ఎల్ఎస్డీ..కొకైన్..ఒకటేమిటీ.. ఒక్కో వాటితో ఎంజాయ్ చేయాలనే కోరిక యువత జీవితాలను చిధ్రం చేస్తున్నది. చివరకు ప్రాణాల మీదకు తెస్తున్నది.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ)
మాదక ద్రవ్యాల గుట్టును తవ్వుతున్న పోలీసుల విచారణలో ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి వివిధ మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తున్న మత్తు పదార్థాలు యువత జీవితాన్ని చిదిమేస్తున్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వ ఆదేశంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ) డ్రగ్స్‌కు ఎలా బానిసవుతున్నారు? వినియోగదారులు విక్రేతలుగా ఎలా మారుతున్నారు? అనే అంశాలపై లోతుగా విచారణ చేస్తున్నది. ప్రధానంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బీర్‌తో మొదలై… చివరకు మత్తుకు బానిసలుగా మారుతున్నట్లు గుర్తించారు. ఇందుకు అనువుగా వైజాగ్ నుంచి మాదకద్రవ్యాలు దిగుమతి అవుతుండగా… గోవా నుంచి సింథటిక్ డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో సులువుగా వీటి బారిన పడుతున్నట్లు వెల్లడైంది. డ్రగ్స్ నెట్‌వర్క్‌లోకి వెళ్లి ఏది కావాలంటే అది కేవలం ఫోన్ కాల్స్‌తో ముంగిటకు వస్తున్నట్లు తేలింది.
మత్తులోనే ధనార్జన…
తొలుత డ్రగ్స్ వినియోగదారులుగా రొచ్చులోకి దిగుతున్న అనేక మంది యువకులు ఆపై డ్రగ్స్ విక్రేతలుగా మారుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలినాళ్లలో తన స్నేహితులకు డ్రగ్స్ లభించే సమాచారాన్ని చేరవేసే దశ నుంచి చివరకు గోవా వంటి ప్రాంతాలకు డ్రగ్స్ వినియోగించేందుకు వెళ్లి… తిరుగు టపాలో కొంతమేర వెంట తీసుకురావడం, ఇక్కడ తన స్నేహితులకు వాటిని విక్రయించడం మొదలుపెట్టినట్లుగా తేలింది. క్రమేణా మత్తులో మునిగే యువకులు చదువు, ఉద్యోగం మానేస్తున్నారు. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులు కావాల్సి వస్తుండటంతో విక్రేతలుగా అవతారమెత్తుతున్నారు. హశీశ్ ఆయిల్ మొదలు సింథటిక్ డ్రగ్స్ వరకు ఇతర రాష్ర్టాల్లో లభించే రేటుకు ఇక్కడ 300-400 రెట్ల మేర ఆదాయం వస్తుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రూ.50వేలతో ఈ మత్తు పదార్థాలను కొనుగోలు చేస్తే… వాటి విక్రయం ద్వారా ఆరు లక్షల వరకు వస్తుందన్నారు. మత్తులో మునిగి తేలడంతో పాటు ఆదాయం కూడా వస్తుండటంతో కొందరు యువకులు విక్రేత కమ్ వినియోగదారులుగా కొనసాగుతున్నారు. ఏ రంగంలో ఉన్న వారు ఆ రంగంలోని తమ స్నేహితులు, సహచరులను నెటవర్క్గా మార్చుకుంటున్నారు.