Hyderabad | బంజారాహిల్స్, జూన్ 21 : బ్రేకప్ చెప్పిన తర్వాత కూడా యువతిని వెంటపడి వేధిస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న యువతి(25)కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2019లో భద్రాచలం ప్రాంతానికి చెందిన రత్నాకర్(25) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో పాటు 2023 దాకా కొనసాగింది. అనంతరం వారిద్దరి మధ్యన విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ తర్వాత కూడా యువతికి ఫోన్లు చేస్తూ రత్నాకర్ వేధిస్తుండడంతో ఫోన్ నెంబర్లు మార్చింది. దాంతో కొంతకాలం వేధింపులు తగ్గిపోయాయి. కాగా ఇటీవల యువతి స్నేహితులవద్ద నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న రత్నాకర్ ఆమె పనిచేస్తున్న ఆస్పత్రి వద్దకు వచ్చి వేధింపులకు దిగాడు. ఆమెను వెంబడిస్తూ ప్రేమించాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాధిత యువతి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 75,78,351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రత్నాకర్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.