అడ్డగుట్ట, జనవరి 5 : అమెరికా మేరీల్యాండ్‌లోని కొలంబియాలో నివాసిస్తున్న మెట్టుగూడ విజయపురి కాలనీకి చెందిన గోడిశాల నిఖిత(27) హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తెప్పించి, తమకు అప్పగించాలని యువతి తండ్రి ఆనంద్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు. విజయపురి కాలనీలో నివసిస్తున్న ఆనంద్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె నిఖిత అమెరికాలోని కొలంబియాలో ఉద్యోగం చేస్తూ గత నాలుగేళ్లుగా అక్కడే ఉంటుంది. అయితే నిఖిత మృతి సంచలనంగా మారింది. చెన్నైకి చెందిన అర్జన్ శర్మ అనే యువకుడు కూడా మొదట్లో నిఖిత, ఆమె స్నేహితులతో కలిసి ఒకే రూమ్‌లో అద్దెకు ఉండేవారు. తర్వాత వారు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు.
ఇదిలా ఉండగా అర్జున్ తన స్నేహితుల వద్ద పలుమార్లు డబ్బు అప్పుగా తీసుకున్నాడు. నిఖిత వద్ద కూడా కొంత డబ్బు తీసుకున్నాడు. సదరు డబ్బును తనకు తిరిగి ఇవ్వాలని అర్జున్ శర్మను నిఖిత పలుమార్లు గట్టిగా అడిగింది. ఇదే విషయమై వారి మధ్య పలుమార్లు వాగ్వివాదం జరిగినట్లు నిఖిత తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. డిసెంబర్ 31న తమ కూతురు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిందని, అదే ఆమెతో మాట్లాడిన ఆఖరి మాటలని నిఖిత తండ్రి ఆనంద్ కన్నీటి పర్యంతమయ్యారు.
నిఖితకు డబ్బులు తిరిగి ఇస్తానని అర్జున్ శర్మ తన రూమ్‌కి పిలిపి హత్య చేసినట్లు అమెరికా పోలీసులు భావిస్తున్నారు. దీనికి బలమైన కారణం అర్జున్ రూమ్‌లో నిఖిత కత్తిపోట్లతో పడి ఉండడమే. పైగా నిఖిత కనిపించడం లేదని అర్జునే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా నిఖితను 31వ తేదిన ఎల్లికాట్ సిటీలో చూశానని, జనవరి 2న పోలీసులకు అర్జున్ ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే అర్జున్ చెన్నైకి పరారై వెళ్లినట్లు తెలుస్తుంది.
అనుమానం వచ్చిన పోలీసులు అర్జున్‌పై సెర్చ్ వారెంట్ జారీ చేసి, అతని రూమ్‌ను పరిశీలిస్తే కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న నిఖితను చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిఖితను అర్జునే హత్య చేసి పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అర్జున్ను చెన్నైలో ఇంటర్‌పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అమెరికాలో హత్యకు గురైన తమ కూతురు నిఖిత మృతదేహాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చేలా చూడాలని నిఖిత తండ్రి ఆనంద్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా తన కూతురు బాడీ తమకు అప్పగించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.