హైదరాబాద్ : మహిళలు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. విద్య, ఉద్యోగం అంటే ఒకప్పుడు మగవాళ్లకు మాత్రమే అన్న మాటను చెరిపేస్తూ తెరమీదకు దూసుకు వస్తున్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన బైలె శిరీష లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అందించే విశిష్ట ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఇండియా నుంచి ఎంపికైన పది మందిలో శిరీష ఒకరు. ఏప్రిల్ 27న ఆమె లండన్‌కు బయల్దేరనున్నారు.
సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా ప్రపంచాన్ని మార్చడం, పర్యావరణ మార్పుల నేపథ్యంలో సమర్థ నాయకత్వాన్ని ఎలా అందించాలన్న అంశంపై వీరికి శిక్షణ ఇస్తారు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్, వ్యాపారం సహా వివిధ రంగాల్లో అనుభవమున్నవారిని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తుంది.
ఈ ఎంపిక విధానం క్లిష్టంగా ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తుంది. అశోక్‌నగర్‌లో నివసిస్తున్న శిరీష ప్రస్తుతం బీహెచ్ఈఎల్లో కార్పొరేట్ పరిశోధన, అభివృద్ధి విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.