రామచంద్రాపురం, డిసెంబర్ 19: ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ లోంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌లోని కేసీఆర్‌నగర్ 2బీహెచ్‌కే సముదాయంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చార్మినార్కి చెందిన హాలమ్ద్దార్ ఉస్సేన్ కూతురు ఫాతిమా, చార్మినార్‌కే చెందిన మీర్ఉస్సేన్ అలీఖాన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కొంతకాలం కోఠిలోని ఓ కాల్సెంటర్లో పని చేశారు. ఫాతిమా కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నది. ఫాతిమా, మీర్ఉస్సేన్ అలీఖాన్ ఇద్దరు కాల్సెంటర్లో పని చేసే సమయంలో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఫాతిమా తండ్రికి కొల్లూర్ 2బీహెచ్‌కే సముదాయంలోని 40వ బ్లాక్‌లో 813 ఫ్లాట్ వచ్చింది.
ఆ కుటుంబం ఇంకా ఇక్కడికి షిఫ్ట్ కాకపోవడంతో ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు ఆయన వచ్చి తమ ఫ్లాట్‌ని చూసుకొని వెళ్లేవాడు. గురువారం మధ్యాహ్నం ఫాతిమా ప్రియుడి తో కలిసి డబుల్ బెడ్రూం ఇంటికి వచ్చింది. అదే సమయంలో తన తండ్రి ఉస్సేన్ ఫ్లాట్ వద్దకు రావడంతో బయట నుంచి తాళం తీసి ఉండడాన్ని గ్రహించి డోర్ కొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా తన తండ్రి గొంతు విని భయంతో టెన్షన్‌కు గురైంది. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ప్రియుడు మీన్ఉస్సేన్ అలీఖాన్ సహకారంతో బాల్కానీ నుంచి కింది బాల్కానీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు సయ్యద్ అలీ అబ్బాస్ ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.