Cyber Crime | సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): కొత్త స్నేహితుల కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారా నిండా మునగడం ఖాయం. ఫ్రెండ్షిఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన వెబ్సైట్లు, యాప్‌లోకి వెళ్లి ముక్కూమొహం తెలియని వారితో స్నేహం చేస్తే అసలుకే మోసం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సైబర్‌నేరగాళ్లు ఉద్యోగాలు, స్టాక్ ట్రేడింగ్, పెండ్లిళ్లు, ఇన్సూరెన్స్, రుణాలంటూ వివిధ రకాలుగా నమ్మించి మోసం చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌పై ఫైండ్ న్యూ ఫ్రెండ్స్ ఇన్ ఆన్లైన్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ ప్రకటనలు చూసి కొందరు నిజమని నమ్మేస్తున్నారు. అందులోనూ అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టుకొని సైబర్‌నేరగాళ్లు పరిచయాలు చేసుకుంటున్నారు. స్నేహం పెరిగిన తరువాత అమ్మాయిల్లా మాట్లాడుతూ మోసాలకు తెరలేపుతున్నారు. మొదట్లో ఇలాంటి మోసాలు చాలా జరిగేవి. అయితే వీటిపై అవగాహన పెరగడంతో చాలా మంది ఆ స్నేహాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల తిరిగి ఈ తరహా మోసాలు ప్రారంభమయ్యాయి.
మీర్‌పేట్‌కు చెందిన ఒక వ్యాపారి ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తుండగా ఫైండ్ న్యూ ఫ్రెండ్ ఇన్ ఆన్లైన్ అనే ప్రకటన కన్పించింది. దానిని క్లిక్ చేయడంతో యాప్ డౌన్లోడ్ అయ్యింది. యాప్ డౌన్లోడ్ కాగానే రాశి పేరుతో ఒక యువతి కాంటాక్టు అయ్యింది. 15 రోజుల పాటు బాగానే మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఆ తరువాత ఆ యువతి తనకు అర్జెంట్‌గా డబ్బు అవసరముందని, తన ఆస్తిని అమ్మకానికి పెట్టానని, దానిని అమ్మగానే డబ్బు ఇస్తానంటూ నమ్మించింది. వారం పది రోజులకోసారి డబ్బులు అడుగుతూనే మరోవైపు స్నేహం కొనసాగించింది.
ఇలా 2024 ఆగస్టు నుంచి 2025 ఏప్రిల్ వరకు డబ్బులు అవసరమున్నాయంటూ నమ్మిస్తూ 8 నెలల్లో రూ. 33.12 లక్షలు కాజేసింది. అయితే డబ్బులు లేవనప్పుడల్లా యువతి అలిగినట్టు నటించడంతో ఎక్కడ స్నేహం కట్ చేస్తుందోనని భయపడిన బాధితుడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు. అయినా ఈ నగదు అప్పుగా ఇచ్చానని.. తిరిగి వస్తుందన్న భ్రమలో ఉన్నాడు.తీరా తీసుకున్న నగదు ఇవ్వాలని యువతిని కోరగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఈ విషయమై బాధితుడు ఆరా తీయగా పక్కా స్నేహం ముసుగులో నగదు కాజేసిందని గుర్తించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.