బంజారాహిల్స్, డిసెంబర్ 27: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను లిఫ్ట్ అడిగి.. బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు చిక్కిన మహిళను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ సమీపంలోని బాచారం గ్రామానికి చెందిన బొడిగె అర్చన (35) గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి, చెడు వ్యసనాలకు బానిసగా మారింది. ఇటీవల ఆన్లైన్ గేమ్స్‌లో సుమారు రూ.10 లక్షల వరకు పోగొట్టుకుంది. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులో వెళ్లడం, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో లిఫ్ట్ అడిగి.. ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు గుంజుతోంది. ఈ నెల 24వ తేదీ సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నం. 2లోని సాగర్ సొసైటీ సమీపంలో బైక్‌పై వెళ్తున్న బేగంపేట సమీపంలోని రసూల్‌పుర ప్రాంతానికి చెందిన గుత్తి జంగయ్యను నిందితురాలు అర్చన లిఫ్ట్ అడిగింది. కొంతదూరం వెళ్లగానే అతడిని అభ్యంతరకరంగా తాకడంతో పాటు గదికి వెళ్దామంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.
కిందకు దిగాలని జంగయ్య చెప్పడంతో.. గొడవకు దిగిన అర్చన, తనను అసభ్యంగా తాకుతూ వేధిస్తున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటే తనకు డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడంతో సమీపంలోని ఏటీఎం వద్దకు తీసుకువెళ్లి రూ.20వేలు డ్రా చేసి ఇచ్చాడు. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలతో పాటు టెక్నాలజీ ఆధారంగా నిందితురాలి ఫోన్ నంబర్‌ను కనిపెట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా అర్చనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. చాలా కాలంగా ఆమె లిఫ్టు పేరుతో చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న విషయం బయటపడింది. నగరంలో దాదాపు 40 మంది వద్ద నుంచి ఆమె డబ్బులు లాగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతర పోలీసు స్టేషన్ల పరిధిలో ఆమెపై నమోదైన కేసుల వివరాలను సేకరిస్తుండటంతో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. చాకచక్యంగా అర్చనను పట్టుకున్న బంజారాహిల్స్ క్రైం పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.