Crime News | బొల్లారం, డిసెంబర్ 22 : ఓ యువకుడిని కత్తులు, బ్లేడ్లతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓల్డ్ బోయిన్పల్లి ఆలీ కాంప్లెక్స్ బస్తీకి చెందిన సమీర్(20) వెల్డింగ్ పనిచేస్తుంటాడు. శనివారం రాత్రి భోజనం చేసి ఇంటి బయట కూర్చుని స్నేహితులతో మాట్లాడుతున్నాడు. సుమారు 11:20 గంటల సమయంలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చి సమీర్‌ను కత్తులు, బ్లేడ్లతో విచక్షణా రహితం గా దాడిచేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సమీర్‌పై దాడికి పాల్పడుతున్న సమయంలో స్థానిక యువకులు వారించే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
కాగా.. గత ఏడాది హస్మత్‌పేటకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహం నచ్చని అమ్మాయి తరుపువారే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమీర్‌ను హత్య చేయడానికి హంతకులు కొద్ది రోజులుగా బస్తీలో రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రష్మీ పెరుమాళ్, ఏసీపీ గోపాలకృష్ణ, బోయిన్పల్లి సీఐ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ సర్దార్ నాయక్, ఎస్సై నాగేంద్రబాబు, క్లూస్ టీం బృందం పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.