Ghatkesar | ఘట్కేసర్, జూలై 5: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. మానవత్వం, విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రాకు చెందిన ఓ మహిళ(56)కు సుమారు 35 ఏళ్ల కిందట అప్పన్న అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు పుట్టిన తర్వాత సదరు మహిళ భర్తతో విడిపోయింది. అనంతరం శివరామకృష్ణను రెండో వివాహం చేసుకుంది. కొన్నేళ్ల కాపురం తర్వాత అతన్ని కూడా విడిచిపెట్టింది. జీవనోపాధి కోసం కొంతకాలం కిందట హైదరాబాద్కు వచ్చింది. ఘట్కేసర్లోని ఎస్బీఐ బ్యాంక్ భవనం సెల్లార్లో నివసిస్తూ వివిధ ఇళ్లలో పని చేస్తోంది.
మొదటి భర్తకు జన్మించిన రెండో కుమారుడు విజయ్ (25) అప్పుడప్పుడు తల్లిని చూసేందుకు వచ్చేవాడు. గత రెండు నెలల నుంచి ఆమె వద్దే ఉంటున్నాడు. విజయ్ తరచూ మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవపడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విజయ్ మరోసారి తల్లితో గొడవపడ్డాడు. రాత్రిపూట ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకుని మెడకు విద్యుత్ తీగను వేసి బెదిరించడంతో పాటు నోటిలో గుడ్డకుక్కి ఊపిరాడకుండా చేసి మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.