కంటోన్మెంట్, నవంబర్ 16: తాళం వేసి ఉన్న ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కార్ఖానా ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… బోయిన్పల్లి పరిధిలోని మహాత్మానగర్‌కు చెందిన కళ్యాణ్‌కుమార్ ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పని చేసేవాడు. అక్టోబర్ 29వ తేదీన టెంపుల్ అల్వాల్ ప్రాంతంలో ఓ రెండంతస్తుల భవనంలోకి ప్రవేశించాడు.
ఆ భవనంలో ఉన్న మూడు ఇండ్ల తాళాలు ఉండటం గమనించి ఓ ఇనుపరాడ్‌తో తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. రూ.33వేల నగదుతోపాటు బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అనంతరం ఈనెల 5వ తేదీన కార్ఖానా పరిధిలోని ఓల్డ్ వాసవినగర్‌లోని చోల్ లా అపార్ట్మెంట్లోని 4వ ఫ్లోర్లో ఓ ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటాన్ని గమనించి ఆ ఇంటి వద్దకు వెళ్లి ఇనుపరాడ్‌తో పగులగొట్టి రూ.55వేల నగదుతోపాటు బంగారు ఆభరణాలను దొంగిలించాడు. సీసీ కెమెరాల్లో కళ్యాణ్‌కుమార్ వాడిన వాహనాన్ని గుర్తించిన పోలీసులు రెండు రోజుల కిందట అతడిని అతని నివాసంలోనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దాదాపు రూ.10లక్షల విలువజేసే బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.