సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): హ్యూమన్ ట్రాఫిక్ కేసులో మీరు విచారణకు బెంగుళూరుకు రావాలి.. రాలేని పక్షంలో మిమ్ముల్ని డిజిటల్ అరెస్ట్ చేసి విచారిస్తామంటూ సైబర్‌నేరగాళ్లు ఓ రిటైర్డు ఉద్యోగి దంపతులను బెదిరించి.. 45 రోజులుగా దఫదఫాలుగా రూ.47లక్షలు దోచేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి మే 30న సైబర్ నేరగాళ్లు ఫోన్‌చేసి.. తాము టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు చాలా కేసులతో సంబంధాలు ఉన్నాయి.. మీ ఫోన్ బ్లాక్ చేస్తున్నాం..మీపై బెంగుళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.. శివప్రసాద్ అనే పోలీస్ అధికారితో మాట్లాడాలంటూ ఒక నంబర్‌ను ఇచ్చారు.
వెంటనే రిటైర్డ్ ఉద్యోగి.. ఆ ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగా.. అవతలి నుంచి మీరు విచారణ నిమిత్తం బెంగుళూర్‌కు రావాలంటూ సూచించగా..తనకు బెంగుళూరు తెలియదని, అక్కడికి రాలేనంటూ చెప్పాడు.. వెంటనే పోలీస్ అధికారి( సైబర్‌నేరగాడు) అతనికి వీడియో కాల్ చేసి, మీ నంబర్‌తో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించి.. ఆధార్, ఫోన్ నంబర్, పాన్ కార్డు, బ్యాంకులతో పాటు ఇతర వివరాలు సేకరించి.. ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించారు.
ఇంతకు నేను చేసిన నేరమేంటీ అని బాధితుడు ప్రశ్నించగా.. సదాకత్ ఖాన్ అనే పేరు మోసిన నేరస్థుడికి సంబంధించిన హ్యుమన్ ట్రాఫిక్ కేసుతో మీకు సంబంధాలున్నాయి.. మీ ఆధార్ కార్డును విక్రయించా రు.. నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. 30 లక్షలు అందులో డిపాజిట్ అయ్యాయి.. మీపై సైబర్ సెల్లో కేసు నమోదయ్యింది.. మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉందంటూ మే 31, జూన్ 1న రెండు రోజుల పాటు సైబర్‌నేరగాళ్లు బాధితులతో వీడియో కాల్లో మాట్లాడారు. మీరు ఈ కేసు నుంచి బయటపడాలంటే ఐపీఎస్ అధికారి నవజోత్ సిమి ఆఫీసర్‌తో మాట్లాడంటూ ఒక నంబర్ ఇచ్చారు.
బాధితులు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా.. మీరు నేరం చేశారో, లేదో, తెలియాలంటే విచారణ చేయాల్సి ఉంటుందని.. మీ ఖాతాల్లో నేరానికి సంబంధించిన డబ్బులు డిపాజిట్ కాలేదని తేలాల్సి ఉందని.. అప్పటి వరకు మీరు కొంత డబ్బును ఆర్బీఐ నేతృత్వంలోని బ్యాంకు ఖాతాలోకి డిపాజిట్ చేసి విచారణ ఎదుర్కొవాలని..అందుకు సంబంధించిన రాకేశ్‌కుమార్ అనే అధికారి మీతో మాట్లాడు తాడంటూ సూచించారు. రాకేశ్‌కుమార్ ఇచ్చిన నంబర్లకు అదే రోజు రూ.11 లక్షలు డిపాజిట్ చేశారు..
అలా జూన్ 3 నుంచి 13 వరకు రోజు గంటసేపు డిజిటల్ అరెస్ట్‌తో సైబర్‌నేరగాళ్లు బాధితులకు ఫోన్‌చేసి మాట్లాడారు. మీరు రూ. 35.73 లక్షలు చెల్లిం చాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిందని ఆ డబ్బును డిపాజిట్ చేయాలంటూ సూచించారు. అలా జూలై 23వరకు సైబర్‌నేరగాళ్లు ప్రతి రోజు వీడియో కాల్లో టచ్‌లో ఉన్నారు. ఈ మధ్యలో బాధితుడు విజయవాడలో ఉన్న తన భార్య పేరుపై ఉన్న ఫ్లాట్‌ను విక్రయించాడు. అక్కడ వచ్చిన డబ్బులను సైబర్‌నేరగాళ్లు చెప్పిన ఖాతాలోకి డిపాజిట్ చేస్తూ వెళ్లాడు. ఇలా రూ. 46,74,101 సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి దఫ దఫాలుగా డిపాజిట్ చేశాడు. ఈ క్రమంలో తెలిసిన వారితో ఈ విష యాన్ని చర్చించగా ఇదంతా మోసమంటూ చెప్పడంతో బాధితు డు ఆదివారం రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫి ర్యా దు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.