సిటీబ్యూరో, జూలై 30 ( నమస్తే తెలంగాణ ) : మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు వాహనదారులపై ఆర్టీఏ సర్వీస్ చార్జీ భారం మోపింది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం దేవుడెరుగు.. పాత వాహనాలను కూడా కొనలేని దుస్థితిని రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఆర్టీఏ అధికారులు అమలు చేసిన జీవో 51తో సర్వీస్ చార్జీ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీస్ చార్జీ సెకండ్ వాహనాల మీద కూడా మోత మోగుతుంది. కొత్త బండైనా.. పాత బండైనా సర్వీస్ చార్జీ ఒకే విధంగా ఆర్టీఏ అధికారులు వసూలు చేస్తున్నారు. ద్విచక్రవాహన ధరపై 0.5 శాతం.. ఫోర్ వీలర్‌పై 0.1 శాతం చార్జీ చేస్తున్నారు.
అయితే పాత వాహనం ఎవరికైనా విక్రయిస్తే ఆ వాహనానికి సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం సర్వీస్ చార్జీ వాహన ధర ఆధారంగా వేలల్లో మోగుతుంది. దీంతో డబ్బులు లేక సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేద్దామనుకున్న వారికి ఇబ్బందిగా మారింది. పాత బండ్లను కూడా కొనలేమంటూ చేతులెత్తేస్తున్నారని సెకండ్ వాహనాల విక్రయ సంస్థలు గోడు వెల్లబోసుకుంటున్నాయి.
అంతా గందరగోళం..!
పాత వాహనాన్ని సగం డబ్బుకో, తక్కువ ధరకో కొనుగోలు చేస్తుంటారు. రూ.10లక్షల కారును రూ.4లక్షలకు ఒక వ్యక్తి కొనుగోలు చేస్తే.. ఆ వ్యక్తికి సర్వీస్ చార్జీ మాత్రం రూ.10 లక్షల (ఇన్వాయిస్ ధర) మీద పడుతుంది. మొత్తం ధరపై 0.1 శాతం రుసుం చెల్లించాలి. గతంలో వంద ఉండగా, ఇప్పుడు ధర ఆధారంగా వేలల్లో మోగనుంది. మరోవైపు జీవో ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తే అంతకన్న ముందే కొనుగోలు చేసిన వాహనాలపై సైతం సర్వీస్ రుసుం భారం మోపుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీఓ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వర్తించాల్సిన ధరలు జీఓకు ముందు వాహనాలకు కూడా అధికారులు కౌంటర్ల వద్ద డబ్బులు కట్టించుకుంటున్నారని చెబుతున్నారు. పాత బండ్లకు అప్పటి ఇన్వాయిస్ ధరకు సంబంధించిన ఆధారాలు ఉండవు. ఆ వివరాలూ ఆర్టీఏ సర్వర్‌లో లేవని చెబుతున్నారు. ఈ రిస్థితుల్లో సర్వీ స్ చార్జీలను అధికారులే నిర్ణయించి భారం వేస్తున్నారని చెబుతున్నారు. ఇష్టానుసారంగా సర్వీస్ చార్జీలు వసూలు చేయడం న్యాయ విరుద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రియల్ బ్రేకులు..!
రియల్ ఎస్టేట్ తగ్గడం, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, హైడ్రా దూకుడుతో నిర్మాణ రంగం కుంటుపడటం, హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీలు తరలిపోవడం కారణాలతో గ్రేటర్లో అనిశ్చితి ఏర్పడింది. కేసీఆర్ పాలనలో భూములకు ధరలు ఉండటం, కంపెనీల ఏర్పాటు, స్టార్టప్ ఐడియాలకు ప్రోత్సాహం, వీహబ్ వంటి వినూత్న కార్యక్రమాలతో మహిళలను సైతం వ్యాపారధిపతులుగా తయారయ్యారు. ఈ క్రమంలో వాళ్లంతా ఆర్థికంగా బలపడ్డారు.
ఈ మార్పు కార్ల షోరూంలకు కలిసొచ్చేది. కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఆ సందడి వాహన షోరూంలో ఇప్పుడు కరువైంది. నగరవ్యాపారులు ఏ వ్యాపారం, నిర్మాణం తలపెట్టాలనుకున్నా ధైర్యంగా అడుగువేయలేకపోతున్నారు. లాభాలు దేవుడెరుగు.. ఉన్న డబ్బులు కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే భయంతో ఖర్చులు తగ్గించేశారు.
దీనికి తోడూ మధ్యతరగతి ప్రజలు తమ బడ్జెట్లో సెకెండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడం గతంలో అధికంగా ఉండేది. కానీ 2024 నుంచి సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు కూడా తగ్గాయని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, గ్రేటర్లో ఇప్పటి వరకు 84లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో కార్లు 15,33,008 ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు 61 లక్షలు ఉన్నాయి. విద్యాసంస్థల బస్సులు 15151 ఉన్నాయి. ఆటోలు 1,07,259 ఉన్నాయి.
11 కోట్లు స్వాధీనం
శంషాబాద్ రూరల్, జూలై 30: వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి చెందిన సులోచన ఫాంహౌజ్‌పై మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారు జామున వరకు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు దాడులు నిర్వహించి అక్కడ నిల్వ చేసిన రూ. 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాల చెందిన కీలక ఉద్యోగి వినయ్‌రెడ్డిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేయగా, కళాశాల యాజమానులకు చెందిన తీగల విజయేందర్‌రెడ్డి, ఉపేందర్రెడ్డిల ఫాం హౌజ్‌లో నగదు అట్టపెట్టెల్లో దాచిపెటినట్లు వినయ్‌రెడ్డి చెప్పడంతో దాడులు చేశామని అధికారులు తెలిపారు.