మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 7: అడిగిందే తడవుగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ నిదులతో చేపడుతున్న అభివృద్ధితో పాటు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న అంతర్గత రోడ్లు,ఆలయాలను తన సొంత డబ్బులు వెచ్చించి అభివృద్ధి చేస్తునారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి నెల రోజుల క్రితం మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట గ్రామంలో మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలను నేరుగా కలిసి ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో సీసీ రోడ్లు అసంపూర్తిగా ఉండటంతో వర్షాకాలంలో ఇబ్బందిగా ఉందని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా తన వంతు బాధ్యతగా రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండు రోజులకే సొంత డబ్బులతో గ్రామంలో సీసీరోడ్ల పనులు ప్రారంభించారు. ఇలా ఒక్కొక్క రోడ్డు వేడుకుంటూ 20 రోజుల్లో సీసీ రోడ్లను పూర్తి చేశారు. దీంతో గ్రామం ఎటూ చూసినా వెడల్పాటి సీసీ రోడ్లతో అందంగా రూపుదిద్దుకోవడమే కాకుండ పరిశుభ్రంగా మారింది. తమ సమస్యను అడిగిన వెంటనే తీర్చిన మంత్రి మల్లారెడ్డి రుణం తీర్చుకోలేనిదని, ఆయనను తాము ఎన్నటికి మర్చిపోమని గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి సహకారం మరువలేనిది..
గ్రామ అభివృద్ధికి మంత్రి మల్లారెడ్డి సహకారం మరువలేనిది. గ్రామంలో మంత్రి సహకారం,సూచనలతో ప్రణాళికాబద్ధ్దంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. మంత్రి గ్రామంలో పర్యటించి సమస్యను తెలుసుకుని సొంత డబ్బులతో రోడ్లు వేయడంతో సమస్య పరిష్కారమైంది.సీసీ రోడ్లు వేయడంతో గ్రామం అందంగా మా రింది. ఆలయాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం.
– వెన్నెల రామకృష్ణుడు, సర్పంచ్, ఎల్లంపేట
మంత్రికి కృతజ్ఞతలు
ఏ నాయకుడు చేయలేని విధంగా మంత్రి మల్లారెడ్డి సొంత డబ్బులు గ్రామాభివృద్ధికి వెచ్చించినందుకు కృతజ్ఞతలు. గ్రామానికి వచ్చిన మంత్రికి సమస్యలు చెప్పగానే తమ ఊరి మొత్తానికి రోడ్లు వేయించారు. దీంతో ఎల్లంపేట గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల సమస్య తీరిపోయింది.
– కుమార్ యాదవ్, ఎంపీటీసీ
రోడ్లు బాగుపడ్డాయి..
మంత్రి మల్లారెడ్డి సహకారం తో గ్రామంలో సీసీ రోడ్లు బాగుపడ్డాయి. గుంతల రోడ్లల్లో ఇబ్బందిగా ఉన్న ప్రజలకు సీసీ వేయడంతో సమస్య తీరింది. ఎవరు చేయని విధంగా మా కోసం, గ్రామస్తుల కోసం ఇంత పెద్ద పని చేసిన మంత్రి రుణం తీర్చుకోలేనిది. ఆయనకు మేము రుణపడి ఉంటాం.
-కే. రాజశేఖర్, ఎల్లంపేట గ్రామస్తుడు