బంజారాహిల్స్,అక్టోబర్ 8 : మురుగునీటి సమస్యలను పరిష్కరించడం ప్రాధాన్యత అంశంగా బంజారాహిల్స్ డివిజన్లో రూ.31లక్షల వ్యయంతో పనులు చేపట్టామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో సివరేజీ సమస్యల పరిష్కారం కోసం జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో రూ.7.9లక్షల వ్యయంతో 300 ఎంఎం డయా సివరేజీలైన్ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు ఎమ్మెల్యే కాలనీలో రూ.4.7లక్షల వ్యయంతో శ్రీరాంనగర్‌లో రూ.3.5లక్షలు, బోళానగర్లో రూ.6.3 లక్షలు, అంబేద్కర్‌నగర్‌లో రూ.3.9లక్షలు వేమిరెడ్డి ఎన్క్లేవ్ కాలనీలో రూ.4.9లక్షల వ్యయంతో సివరేజీ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ పనులన్నింటినీ యుద్ధప్రాతిపాదికన పూర్తిచేసేలా జలమండలి అధికారులు చొరవ చూపాలని మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, సెక్షన్ మేనేజర్ రాంబాబు, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.