GHMC | సిటీబ్యూరో: అసలే తక్కువ జీతం.. ఆపై ఔట్సోర్సింగ్.. వెరసి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఒకరోజు జీతానికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కోత పెట్టింది బల్దియా. వరద బాధితుల సహాయం కోసమే కోత పెట్టినట్లు అధికారులు చెబుతుండగా, సమ్మతి లేకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. బల్దియాలో 22,019 మందికి పైగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు.
నెలకు జీతం రూ. 18వేలు.. ఈఎస్ఐ, ఈపీఎఫ్లు కట్ చేశాక వారి చేతికి వస్తున్నది రూ. 14వేలు మాత్రమే. ఆ మొత్తంతో కుటుంబ భారం మోస్తున్న పారిశుధ్య కార్మికులపై ఒక్కసారిగా బల్దియా భారం మోపింది. వారు తీసుకున్న నెలవారీ జీతంలో ఒక్క రోజు వేతనాన్ని కోత పెట్టింది. కనీసం కార్మికులకు ఒక మాట చెప్పకుండా, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఖమ్మం వరద బాధితుల సహాయార్థం పేరిట బల్దియా ఉద్యోగులంతా ఒక్కరోజు వేతనం చెల్లిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే లక్షలు జీతాలు తీసుకునే వారి నుంచి ఒక్క రోజు వేతనం కట్ చేస్తే వారికి వచ్చే నష్టమేమీ లేదు. ఇక్కడ పారిశుధ్య కార్మికులు రెగ్యులర్ ఉద్యోగులు కాదు..ఆపై ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారు. చిన్న జీతాలు తీసుకునే వారని చూడకుండా ముందస్తుగా ఒక్క మాట చెప్పకుండా ఒక్కో కార్మికుడి నుంచి రూ.600 మేర ఒక్కరోజు వేతనాన్ని కట్ చేశారు. కార్యక్రమం మంచి ఉద్దేశమే అయినా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాన్ని జత కట్టడం, ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.