నాచారం, డిసెంబర్8: తమ జీతాలు పెంచాలంటూ నాచారం పారిశ్రామికవాడలోని షాహి ఎక్స్‌పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ ఎదుట ఆ కంపెనీలో పనిచేసే వందలాది మహిళా కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ.. షాహి ఎక్స్‌పోర్టు కంపనీలో దాదాపు 2వేల మంది మహిళా కార్మికులు పని చేస్తున్నారు. పదేళ్లుగా కంపనీలో పనిచేస్తున్నా జీతాలు పెంచడం లేదని, నెలలో రెండు సెలవులు ఉంటాయని, సెలవులు ఉపయోగించుకుంటే జీతాలు కట్ చేస్తారని, ఎక్కువ పని గంటలు చేయించుకుంటారని, గంటకు టార్గెట్ ఇచ్చి అధిక పని చేయించి ఒత్తిడికి గురిచేస్తారని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా గేట్ బయట నిలబెట్టి ఆఫ్ డే జీతం కట్ చేస్తారని, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు ఇవ్వడం లేదని..
కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో పనిచేసే కార్మికులపై సూపర్వైజర్లు, ఇతర అధికారులు టార్గెట్ పూర్తికాకపోతే దుర్భాషలాడతారని, కొన్ని సందర్భాలలో కొందరు మహిళా కార్మికులను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడంతో నాచారం ఐలా నుంచి మల్లాపూర్ ఐలాకు వెళ్లే రహదారి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ధర్నా చేస్తున్న మహిళా కార్మికులకు సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు తెలిపాయి. ఆ పార్టీ నాయకులు సత్యప్రసాద్, కోమటి రవి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేసిన యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.