బేగంపేట్ నవంబర్ 27 : అకారణంగా ఓ బీసీ మహిళను లయన్స్ క్లబ్ సభ్యత్వం నుంచి తొలగించారని ఎంఆర్పీఎస్ మహిళా నాయకులు లయన్స్ భవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. గురువారం సికింద్రాబాద్ ప్యారడైజ్లోని లయన్స్ భవన్ వద్ద ప్లకార్డులతో ఈ నిరసన ప్రదర్శించారు. బండారు లలిత అనే లయన్స్ క్లబ్ మెంబర్ను ఎందుకు తొలగించారో లయన్స్ మెంబర్స్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓ బీసీ మహిళ లయన్స్ క్లబ్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగంతో పాటు క్లబ్లో జరుగుతున్న అన్యాయాలను నిలదీసినందుకు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని లేదంటే న్యాయం జరిగే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువురితో సంప్రదింపులు జరిపారు. పోలీసులు న్యాయ అన్యాయాలపై దర్యాప్తు చేస్తున్నారు.