బేగంపేట్ జూలై 16: బేగంపేట శ్రీదేవి కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ చెక్కల సుభాశ్ముదిరాజ్, ఈవో అంబుజాలు వారిని ఘనంగా సత్కరించారు. దీంతో పాటు బేగంపేట్ శ్యామ్‌లాల్, మయూరిమార్గ్, తాతాచారి కాలనీ, అల్లంతోటబావి, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో బోనాల వేడుకలు నిర్వహించారు. కట్ట మైసమ్మ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
విజయదుర్గ ఆలయంలో..
జూబ్లీహిల్స్,జూలై16: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల ఉత్సవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ అన్నారు. ప్రభుత్వం బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తూ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. ఆదివారం ఆషాఢ బోనాల ఉత్సవాలు పురస్కరించుకుని వెంకటగిరి విజయదుర్గ ఆలయంలో కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో కలిసి ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు.
వెంగళరావునగర్‌లో…
వెంగళరావునగర్, జూలై 16 : బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెంగళరావునగర్,శ్రీనగర్ కాలనీ,రహ్మత్‌నగర్ డివిజన్లలోని దేవాలయాల్లో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు, అధికారులు స్వాగతం పలికి..ఎమ్మెల్యే మాగంటిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ బోనాల పండుగను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని..దేవాలయాలకు కావాల్సిన నిధులను మంజూరు చేసిందన్నారు. అందరిని సల్లంగా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. దేవస్థాన కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖాధికారులు, దేవాలయ అర్చకులంతా బోనాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు, నాయకులు నజీర్, బషీర్, అరుణ్, సమీనా, ఛోటు, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.
చీర, పండ్లు సమర్పించిన కార్పొరేటర్ దేదీప్య
వెంగళరావునగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ, వెంగళరావునగర్ రాజరాజేశ్వరి దేవాలయం, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలోని శ్రీ పోచమ్మ ఆలయం, రహ్మత్‌నగర్‌లోని పోచమ్మ ఆలయం, మధురానగర్ శ్రీ నాగలక్ష్మి ఆలయాల్లో ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకల్లో వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య పాల్గొన్నారు. అమ్మవారికి సంప్రదాయబద్ధంగా చీర, పండ్లు సమర్పించుకున్నారు.
జీటీఎస్ దేవాలయంలో…
వెంగళరావునగర్ డివిజన్లోని జీటీఎస్ దేవాలయంలో ఆదివారం బోనాల పండుగను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. బోనాల వేడుకల సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. జీటీఎస్ దేవస్థాన కమిటీ చైర్మన్ చిన్న రమేశ్ సతీసమేతంగా కుటుంబసభ్యులుతో,ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ .లక్ష్మి, వెంకటేశ్వర్లు,దేవేందర్ శర్మలతో కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, దేవాలయ అధికారులు పాల్గొన్నారు.
బోరబండలో….
ఎర్రగడ్డ, జూలై 16: బోరబండలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బోరబండ బస్ టెర్మినల్‌లోని పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీందర్‌తో పాటు కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఆహ్వానం పలికి సన్మానించారు. అంతకు ముందు సైట్-1 కాలనీ నుంచి మహిళలు బోనాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. డివిజన్ బీఆర్ఎస్ నేతలు విజయసింహ, విజయకుమార్, సిరాజ్, లక్ష్మణ్‌గౌడ్, ఆనంద్, దేవమణి, రమేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బోరబండ పోలీసులు బస్ టెర్మినల్ సర్కిల్‌తో పాటు వివిధ ఆలయాల వద్ద బందోబస్తు నిర్వహించారు. డివిజన్లోని రాజ్‌నగర్, సాయిబాబానగర్, వీకర్‌సెక్షన్, సైట్-3 తదితర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల వద్ద కూడా బోనాల ఉత్సవాల సందడి కన్పించింది.