నగరంలో ఓ అమ్మవారి దేవాలయం ఉన్న ప్రాంతంలో ఓ వృద్ధుడు తన మనమరాలి వయసున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న షీ టీమ్స్ నిఘా బృందం అతనిని గమనించి పట్టుకున్నారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ సమయంలో అతని కుటుంబసభ్యులకు ఆ వృద్ధుడి ప్రవర్తనను సీసీ ఫుటేజ్‌లో చూపించడంతో అతను తలదించుకున్నాడు. మరోసారి ఇలా జరిగితే జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరించి పోలీసులు వదిలేశారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఓ మెట్రో స్టేషన్ సమీపంలో దంపతులు నడిచి వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు వేధించారు. తన భార్యను ఎందుకు టీజ్ చేస్తున్నారంటూ అడిగిన భర్తపై దాడి చేశారు. ఆ మహిళ షాక్‌కు గురై దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారమిచ్చారు. పోలీసులు వారిని గుర్తించి పట్టుకోగా, వారంతా మైనర్లేనని తేలింది.
మాసబ్‌ట్యాంక్‌కు సమీపంలో ఉన్న ఒక ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగి తననెవరూ గమనించడం లేదని అక్కడికి వచ్చిన యువతితో అనుచితంగా ప్రవర్తించాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులతో ఆయన వాదించగా.. వారు సీసీ ఫుటేజ్ చూపించారు. ఆ తర్వాత అతను కాళ్లావేళ్లా పడడంతో వదిలేసిన పోలీసులు అతని శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అతనికి మెమో ఇచ్చారు.
నగరంలో ఆడపిల్లలకు పోకిరీల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. రెండేండ్లలో ఈ వేధింపులకు సంబంధించి నమోదైన కేసులు రెట్టింపు సంఖ్యకు చేరుకున్నాయి ఈ సంవత్సరం నవంబర్ వరకు నాలుగువేలకు పైగా నమోదైన కేసులు ఆకతాయిల వేధింపుల తీవ్రతకు అద్దంపడుతున్నాయి. రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్‌లు, డ్రగ్స్ తీసుకుంటున్న యువకుల హల్చల్తో చాలా ప్రాంతాల్లో మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. పెట్రోలింగ్ బృందాలు తిరుగుతుండగానే పోకిరీలు తమ పని తాము చేసుకుపోతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో మహిళలు, యువతులు.. వయసుతో సంబంధం లేకుండా వేధింపులకు గురవుతున్నారు. మహిళలైతే చాలు.. వారిని వేధించడం ఆ ప్రబుద్ధులకు అలవాటుగా మారింది. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో టీజ్ చేయడం, వెంటపడి వారిని విసిగించడం, కొన్ని సందర్భాల్లో వెకిలి చేష్టలతో సతాయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులే చెప్పారు. సోషల్ మీడియా, బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల వేధింపులపై నెలకు 500కుపైగా ఫిర్యాదులు వస్తున్నట్లు పోలీసులు చెప్పారు. షీటీమ్స్ నిఘాతో రోజుకు 10-15 మంది పట్టుబడుతున్నారు.
వేధింపులకు గురైన బాధితురాలు ఆ బాధ నుంచి బయటపడడానికి మూడు నుంచి నాలుగునెలల సమయం పడుతున్నదని పోలీసులు చెబుతున్నారు. సీపీ సజ్జనార్ తాను బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే నగరంలో ఆడపిల్లల జోలికి వస్తే సహించేది లేదంటూ పోకిరీలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచామని అధికారులు చెప్పారు. వరుస ఫిర్యాదులతో సజ్జనార్ పోకిరీలపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. పోకిరీల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, వారు పట్టుబడితే సాక్ష్యాలతో కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా వారిపై హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేయమని ఎస్హెచ్ఓలను ఆదేశించారు.
రెండేండ్లలో పెరిగిన పోకిరీలు.!
నాలుగు సంవత్సరాలుగా నగరంలో ఆడవారిని వేధిస్తున్న వారిపై నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ఏయేటికాయేడు పెరిగిపోయాయి. ముఖ్యంగా గత రెండేండ్లుగా ఈ సంఖ్య రెట్టింపైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
ఉద్యోగాలు ఊడుతాయ్ జాగ్రత్త..
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న రద్దీ ప్రాంతాలు, మెట్రో స్టేషన్లు, సినీమాల్స్ వద్ద ఆకతాయిల వేధింపులకు సంబంధించి పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేధింపులకు పాల్పడే వారికి అడ్డుకట్ట వేసే క్రమంలో కేసులు, కౌన్సిలింగ్కే పరిమితం కాకుండా ఆ ప్రబుద్ధులు పనిచేసే కంపెనీలకు కూడా సమాచారమిస్తున్నారు. ఇటీవల నగరంలో వినాయక ఉత్సవాలు, బోనాలు, ఊరేగింపుల్లో యువతులు, మహిళలతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించిన 1600 మందిని పోలీసులు పట్టుకున్నారు.
వీరిలో ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు, మైనర్లు ఉన్నారు. కొంతమందిపై కేసులు నమోదు చేయగా, మరికొందరిని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా.. కొందరి అసభ్య ప్రవర్తన నేపథ్యంలో వారు పనిచేస్తున్న కంపెనీలు, శాఖలకు సమాచారమందించారు. దీంతో కేసులు నమోదైన కొందరు ఆకతాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేయగా, ప్రైవేటు ఉద్యోగుల్లో 20 మందిని కంపెనీల నుంచి తొలగించినట్లు తెలిసింది.
సంవత్సరం : కేసులు
2022: 1268
2023: 1200
2024 :2625
2025 :4300