సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ ఛఠాన్పల్లి తరహాలో ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి చేయడమే కాకుండా తమకు సహకరించడం లేదని బాధితురాలిని వివస్త్రను చేసి, మర్మాంగంలో కర్రలు గుచ్చి అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఇద్దరు మృగాళ్లను ఎట్టకేలకు రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఈ నెల 17న ఓ మహిళ మృతదేహం బయటపడింది.
ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరకున్న వారు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మాంగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. అంతే కాకుండా మృతదేహం కుల్లిపోయిన స్థితిలో ఉండడంతో హత్య జరిగి అప్పటికే రెండు మూడు రోజులైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు కిస్మత్పూర్ వైపునకు వెళ్లే అన్ని దారుల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.
కిస్మత్పూర్ వైపు వచ్చిపోయే సీసీ కెమెరాలను పరిశీలించగా ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్పూర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్లు తేలింది. ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశితంగా పరిశీలించగా అదేరోజు మధ్యాహ్నం హైదర్‌గూడ కల్లు కంపౌండ్ వద్ద నుంచి సదరు మహిళను ఆటోలో ఎక్కించుకుని వచ్చినట్లు తేలింది. అంతే కాకుండా హత్యకు గురైన మహిళ ఆదివారం యాకుత్‌పురా నుంచి హైదర్‌గూడ కల్లు కంపౌండ్‌కు వచ్చినట్లు తేలింది. దీంతో ఆటో నంబర్ ఆధారంగా టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. అంతే కాకుండా మృతురాలికి సంబంధించి యాకుత్‌పురా ఠాణాలో మిస్సింగ్ కేసు సైతం నమోదై ఉంది.
ఈ నెల 14న యాకుత్‌పురాకు చెందిన ఒక మహిళ కల్లు సేవించేందుకు హైదర్‌గూడ కల్లు కంపౌండ్‌కు వచ్చింది. కల్లు సేవించిన అనంతరం మత్తులో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై పడిపోయింది. అదే సమయంలో టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న మహిళ కదలికలను గమనించిన ఆటో డ్రైవర్లు మత్తులో ఉన్న మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జ్ వైపు తీసుకెళ్లారు.
అక్కడ నిర్మానుష ప్రదేశంలో మద్యం సేవించారు. అనంతరం ఒకరి తరువాత ఒకరు సదరు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో స్పృహలోకి వచ్చిన మహిళ ప్రతిఘటించడంతో మృగాళ్లుగా మారిన ఆటోడ్రవర్లు సదరు మహిళను వివస్త్రను చేయడమే కాకుండా ఆమె మర్మాంగంలో కర్రలు గుచ్చి, చిత్రహింసలు పెట్టి, అతి కిరాతకంగా కొట్టి చంపినట్లు పోలీసుల విచారణలో మృగాళ్లు వెల్లడించారు. ఈ మేరకు ఎస్వోటీ పోలీసులు నిందితులను అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.