Water Tank | వాటర్ ట్యాంకుపైకెక్కిన ఓ మహిళ కిందకు దూకుతానంటూ హల్చల్ చేసిన ఘటన జగద్గిరిగుట్ట సమీపంలోని వెంకటేశ్వరనగర్‌లో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగద్గిరిగుట్ట సమీప వెంకటేశ్వరనగర్‌లో రాధిక (40) తన పదేండ్ల కుమారుడితో కలసి నిసముంటోంది. ఒంటరి మహిళ అయిన ఆమె తరచూ ఇంటి యజమానులు, కల్లు కంపౌండ్లవద్ద, పరిచయస్తులతో గొడవ పడేది. తనకు ఇతరులు అన్యాయం చేశారంటూ పలుసార్లు పోలీస్‌స్టేషన్‌కి వచ్చి హడావుడి చేసేది.
ఈ నేపథ్యంలో గురువారం తన కుమారుడికి ఆధార్‌కార్డు ఇవ్వాలంటూ స్థానికంగా ఉన్న ఈ-సేవ కేంద్రానికి వెళ్లింది. బర్త్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలతో దరఖాస్తు చేయాలని ఈ-సేవ కేంద్రంలోని సిబ్బంది సూచించారు. అవేవీ లేకుండా ఆధార్ ఇవ్వాలని వాదనకు దిగింది.
ఆ పై తన కుమారుడిని వెంటపెట్టుకుని జగద్గిరిగుట్ట వెంకటేశ్వర ఆలయ పరిసరాల్లోకి వెళ్లింది. సమీపంలోని వాటర్‌ట్యాంకు పైకెక్కిదూకుతానని బెదిరించింది. అక్కడివారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చేరుకోగా ట్యాంకర్‌పై వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి రెయిలింగ్నుంచి పైకిలాగారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని కౌన్సిలింగ్ ఇచ్చారు.