Hyderabad | హయత్‌నగర్, మార్చి 5 : భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఆమెకు భార్య దేహశుద్ధి చేసింది. భర్తతో పాటు మహిళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పటికీ ఘటన స్థలం నుంచి భర్త పారిపోయాడు. ఈ ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్కు చెందిన కొత్తపల్లి శ్వేత, ప్రశాంత్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. శ్వేత తండ్రి చనిపోవడంతో ఆమెకు తండ్రి చేసే ఉద్యోగం కారుణ్య నియామకం ద్వారా వచ్చింది. మంచిగా సంసారం సాగుతుందనుకున్నా సమయంలో ప్రశాంత్.. పెద్ద అంబర్‌పేటలోని లక్ష్మారెడ్డి పాలెంలో ఉంటున్న ప్రైవేట్ టీచర్ వాణితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
కొద్దికాలంగా భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన శ్వేత అతని కదలికలపై నిఘా పెట్టింది. ప్రశాంత్ ఎల్బీనగర్ నుండి హయత్ నగర్, లక్ష్మారెడ్డి పాలెం వెళ్లి వాణితో గడుపుతున్నాడు. ఆ వెంటనే ప్రశాంత్‌ను గమనిస్తూ వచ్చిన శ్వేత ఒకే ఇంట్లో ప్రశాంత్ వాణితో ఉండడాన్ని గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇది గమనించిన ప్రశాంత్ గోడ దూకి పారిపోయాడు. భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న వాణిని చితకబాదింది శ్వేత. తన తండ్రి మరణించగా వచ్చిన డబ్బులు 30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారు నగలు వాణికి ఇచ్చాడని శ్వేత ఆరోపిస్తుంది. తనకు న్యాయం చేయాలని శ్వేత సరూర్ నగర్‌లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.