శేరిలింగంపల్లి, నవంబర్ 27: ప్రమాదవశాత్తు ఓ భవనం పైనుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అశ్రితసింగ్(25)కు భర్త సంజయ్‌సింగ్, నాలుగేండ్ల కుమారుడు ఉన్నారు. రాయదుర్గం నాలెడ్జి సిటీ మైహోమ్ భుజా ఈ-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 901లో నివసించే రియల్ వ్యాపారి రాజేశ్‌బాబు(55) భార్య, తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అయితే రాజేశ్‌బాబుకు సంతానం లేకపోవడంతో మధ్యవర్తి సందీప్‌తో కలిసి సరోగసి ద్వారా పిల్లలను కనిచ్చేందుకు ఒడిశాకు చెందిన అశ్రితతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి గాను పరిహారంగా రూ.10లక్షలు చెల్లించేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నారు.
ఆ ఒప్పందం ప్రకారం అశ్రితసింగ్ తన భర్త సంజయ్‌సింగ్, బాబుతో కలిసి అక్టోబర్ 24వ తేదీన నగరానికి వచ్చి మైహోమ్ భుజాలోని రాజేశ్‌బాబు ఇంట్లో ఉంటున్నది. అయితే అశ్రిత రాజేశ్‌బాబు ఇంట్లో ఉంటుండగా, ఆశ్రిత భర్త సంజయ్‌సింగ్, బాబు వాచ్‌మన్ గదిలో ఉంటున్నారు. అధికారికంగా సరోగసి ప్రక్రియను ప్రారంభించేందుకు కోర్టుకు అప్పీల్ చేసుకోగా.. కోర్టు నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది. వారం కిందట అశ్రిత తనకు ఇక్కడ ఉండటం ఇష్టంలేదని, తిరిగి వెళ్లిపోదామని భర్త సంజయ్‌సింగ్‌కు చెప్పింది. అయినా భర్త వద్దని నచ్చజెప్పడంతో బలవంతంగా ఉంటుంది. కాగా, మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అశ్రిత సంజయ్‌సింగ్‌కు ఫోన్‌చేసి తనకు ఇక్కడ ఉండటం కష్టంగా ఉందని, ఉండలేకపోతున్నానని చెప్పినప్పటికీ భర్త మరోసారి నచ్చజెప్పాడు.
కాసేపటికి ఇంట్లోని బాల్కాని నుంచి మూడు చీరలు ఒకదానికొకటి ముళ్లువేసి కింద అంతస్తుకు స్టేర్కేస్కు దిగి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో మైహోమ్ భుజా 9వ అంతస్తు బాల్కాని నుంచి కిందకు చీర సాయంతో దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రి 2 గంటల సమయంలో అశ్రిత మృతదేహాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు ఇంటి యజమాని రాజేశ్బాబుతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వేధింపులు తాళలేక అశ్రిత పారిపోయేందుకు ప్రయత్నించి ఉండవచ్చని భర్త సంజయ్‌సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.